సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వయసు సడలింపు సమ్మతం కాదు - సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరుకాదలచిన అభ్యర్థులకు వయసు సడలింపు ఇచ్చి, మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా 2020లో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే తమ చివరి అవకాశాన్ని కోల్పోయిన వారికి మాత్రమే మరో అవకాశాన్ని కల్పిస్తామని, అదీ కూడా వయో పరిమితికి లోబడే ఉంటుందని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరఫును ఫిబ్రవరి 9న విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ప్రభుత్వ అభిప్రాయాన్ని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. అదనపు అవకాశాన్ని కల్పించే ఉద్దేశం తొలుత ప్రభుత్వానికి లేదని, అయితే, ధర్మాసనం సూచనతో అందుకు సమ్మతించిందని తెలిపారు. వయో పరిమితిలో సడలింపు ఇవ్వడం వల్ల ఇతర అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుందని పేర్కొన్నారు. 2021లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయదలచిన వారికి వయో పరిమితిలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
0 Komentar