Biden Signs Executive Orders Reversing
Trump Immigration Policies
వలసల విధానాల్లోని కీలక
ఉత్తర్వులపై బైడెన్ సంతకం - భారత ఐటీ నిపుణులకు చేకూరనున్న లబ్ధి
అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటీ నిపుణులకు మేలు చేసే నూతన వలస విధానానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు బో బైడెన్ ఆమోదం తెలిపారు. ఈమేరకు మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేశారు. చట్టపరమైన వలసదారులకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను సమీక్షించిన బైడెన్ పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
మొదటి ఉత్తర్వు ప్రకారం.. సరిహద్దుల వద్ద కుటుంబాలకు దూరమైన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రత్యేక కార్యాదళం ఏర్పాటుచేయనున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో తమ పిల్లలను దూరం చేసుకున్న దాదాపు 5500 కుటుంబాలకు వారి పిల్లలను చేరువచేసే దిశలో ప్రత్యేక కార్యదళం పనిచేయనుంది.
రెండో ఉత్తర్వు ప్రకారం సరిహద్దుల ద్వారా వలస వచ్చే వారికి ఆశ్రయం కల్పించే విధానం రూపొందించడం సహా వలసల నిరోధక చర్యలను నిలిపివేయనున్నారు. ఈ ఉత్తర్వు ప్రధానంగా మెక్సికో నుంచి వలస వచ్చేవారికి లబ్ధి చేకూర్చనుంది.
మూడో ఉత్తర్వు ప్రకారం గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వలసల విధానాలను సమీక్షించి సురక్షితమైన పారదర్శక వలస విధానాన్ని రూపొందించాలని బైడెన్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమెరికాలో వలస విధానాన్ని మరింత పటిష్ఠం చేయడమే కాకుండా మానవత్వంతో కూడిన వలస విధానానికి నాంది పలుకుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు.
0 Komentar