బీడీఎస్ ప్రవేశాలకు అర్హత మార్కుల తగ్గింపు - దంత వైద్య సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు తీర్పు
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7,000 దంత వైద్య (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ- బీడీఎస్) సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 2020-21లో బీడీఎస్‌లో ప్రవేశానికి అర్హత మార్కులను 10% మేర తగ్గిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత మార్కులను తగ్గించబోమని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం చట్టవిరుద్ధం, అహేతుకమని వ్యాఖ్యానించింది.
జనరల్
కేటగిరి అభ్యర్థులు 40%, దివ్యాంగులు 35%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి
అభ్యర్థులు 30% మార్కులు సాధిస్తే ప్రవేశాలకు అనుమతించాలని
పేర్కొంది. ప్రవేశాల ప్రక్రియను పది రోజుల్లో (ఫిబ్రవరి 18
లోపు) పూర్తి చేయాలని ఆదేశించింది. 2020 నీట్‌లో అర్హత
మార్కులు సాధించి, జనవరి 30 వరకు
కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకాని విద్యార్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌కు హాజరైతే
అనుమతించాలని సూచించింది. 7,000 సీట్లలో 265 మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయని తెలిపింది. దంత వైద్య కోర్సుల్లో
ప్రవేశాలను ప్రోత్సహించేందుకు రుసుములు తగ్గించుకోవాలని ప్రైవేటు కళాశాలలకు
సూచించింది.
దంత వైద్య సీట్ల భర్తీకి అర్హత
మార్కుల శాతం తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు దంత వైద్య కళాశాలల
తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై
జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన
ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 7,500 మందికి ఒక దంత వైద్యుడు ఉండాల్సి ఉండగా దేశంలో 6,080 మందికి ఒకరు ఉన్నారని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా బాటి
తెలిపారు. అందువల్ల అర్హత మార్కుల తగ్గింపునకు అంగీకరించబోమని తెలిపారు. అర్హత
మార్కుల శాతం తగ్గిస్తే విద్యా ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం పడదని, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7,000 బీడీఎస్ సీట్లను
అలాగే వదిలేస్తే కళాశాలల్లోని మౌలిక వసతులు వృథాగా మారుతాయని పిటిషనర్ తరఫు
సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. మెడికల్ సూపర్
స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి 2019-20లో, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు 2020-21లో అర్హత
మార్కులను తగ్గించారని తెలిపారు.
0 Komentar