Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

బడ్జెట్‌ 2021-22 ముఖ్యాంశాలు

 

బడ్జెట్‌ 2021-22 ముఖ్యాంశాలు

1. 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట 

75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్‌ నుంచి మినహాయింపు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు.  పన్నుల వ్యవస్థ సరళీకరణ.. వివాదాల పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.రూ.50లక్షలలోపు ఆదాయం, రూ.10లక్షల లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదాల పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీలు చేసుకునే అవకాశం. 

2. 20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..! 

కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న లక్ష్యంతో.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 

3. ఎన్నికల రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం 

కేరళ, అసోం, బంగాల్‌, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో   నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. 

4. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు 

2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ. 35వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. 

5. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట 

బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

6. బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా రైతు మద్దతు నినాదాలు 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా కొందరు ఎంపీలు రైతులకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు జస్బీర్‌సింగ్‌ గిల్‌, గుర్జీత్‌సింగ్‌ ఔజ్లా లోక్‌సభకు నల్ల కోర్టులు ధరించి వచ్చారు. 

7. పెట్రోల్‌,డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ 

పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించినప్పటికీ వినియోగదారులపై ఎలంటి అదనపు భారం పడదని ఆర్థిక మంత్రి వివరించారు. ఎందుకంటే.. ఇతర పన్నులు తగ్గించడమే అందుకు కారణం. 

8. హామీలతో దూసుకెళ్తున్న మార్కెట్లు 

2021-22 బడ్జెట్‌లో కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం పలు పథకాలను ప్రకటించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం సూచీల సెంటిమెంటును పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం ఉదయం 12:51 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,092.29 పాయింట్లు లాభపడి 47,378.06 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 300.30 పాయింట్ల లాభంతో 13,934.90 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.07 వద్ద కొనసాగుతోంది. 

9. స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు 

పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ. స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజులు కుదింపు.  ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు. 

10. బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐలు 

బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులు భారతీయులే అయ్యి ఉండాలన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags