COVID-19 may have taken 'convoluted
path' to Wuhan, WHO team leader says
కరోనా మూలం చైనా ల్యాబ్ కాదు - బ్ల్యూహెచ్‌వో
నిపుణుల బృందం వెల్లడి
జంతువు ద్వారానే అది మానవుల్లోకి వచ్చి ఉంటుంది
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్..
ఒక జంతువు నుంచే మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), చైనా
శాస్త్రవేత్తల బృందం మంగళవారం పేర్కొన్నాయి. చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్
నుంచి ఇది లీకై ఉంటుందన్న వాదనను కొట్టిపారేశాయి.
చైనాలోని వుహాన్ నగరంలోనే 2019లో కరోనా కేసులు తొలిసారిగా వెలుగు చూశాయి. ఇక్కడి వుహాన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ వైరాలజీలో అనేక రకాల వైరస్ నమూనాలను నిల్వ ఉంచారు. దీంతో అక్కడి నుంచి లీకైన
కరోనా.. సమీప ప్రాంతాల్లోకి వ్యాపించి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని
చైనా ఖండించింది. ఈ వైరస్ మరెక్కడో పుట్టి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా
వైరస్ మూలాలను శోధించేందుకు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన నిపుణుల బృందం జనవరి 14న వుహాన్ చేరుకుంది. మొదట కరోనా కేసులు వెలుగు చూసిన హువానన్ సీఫుడ్
మార్కెట్ సహా అనేక ప్రాంతాలను సందర్శించింది. తాజాగా చైనా శాస్త్రవేత్తలతో కలిసి
మంగళవారం విలేకరులతో మాట్లాడింది. మహమ్మారి తొలి రోజులకు సంబంధించి ప్రస్తుతమున్న
అవగాహన.. తమ పర్యటనతో పెద్దగా మారలేదని డబ్ల్యూహెచ్‌వో బృందం నాయకుడు పీటర్ బెన్
ఎంబ్రేక్ చెప్పారు. కొత్తగా మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
‘‘కరోనా వైరస్.. వైరాలజీ ల్యాబ్ నుంచి లీకై, మానవుల్లోకి
వ్యాపించి ఉండటానికి ఆస్కారం లేదు. గబ్బిలం నుంచి ఇది మరో జంతువులోకి ప్రవేశించి
ఉంటుంది. దాని నుంచి మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రాథమిక విశ్లేషణల్లో ఇదే
వెల్లడైంది’’ అని పేర్కొన్నారు. ఇది గబ్బిలాల నుంచి అలుగు లేదా బేంబూ ర్యాట్ అనే
మరో జంతువు ద్వారా మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు.
నేరుగా గబ్బిలాల నుంచి లేదా శీతలీకరించిన ఉత్పత్తుల వాణిజ్యం ద్వారా కూడా మానవుల్లోకి
ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండటానికీ ఆస్కారం ఉందన్నారు.
కుందేళ్లు, బేంబూ
ర్యాట్స్ సహా హువానన్ సీఫుడ్ మార్కెట్‌లోని కొన్ని జంతువులకు ఈ వైరస్ సోకే
ముప్పు ఉందని డబ్ల్యూహెచ్‌వో బృందం సభ్యురాలు మరియన్ కూప్‌మాన్స్ పేర్కొన్నారు.
కరోనాను పోలి ఉన్న వైరస్‌కు ఆలవాలంగా ఉన్న గబ్బిలాలు ఎక్కువగా నివసించే
ప్రాంతాల్లోని ఫారాల నుంచి ఈ జంతువులు వచ్చాయని చెప్పారు. తదుపరి దశలో ఈ ఫారాలపై
నిశిత దృష్టి పెడతామని వివరించారు. మరోవైపు చైనా శాస్త్రవేత్తల బృందం నాయకుడు
లియాంగ్ వానియన్ మాట్లాడుతూ.. సదరు మార్కెట్‌లోనే కాక నగరంలోని ఇతర ప్రాంతాల్లో
కూడా తొలి రోజుల్లో వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పారు. అందువల్ల ఈ వైరస్
వేరెక్కడో పుట్టి ఉంటుందన్నారు.
డబ్ల్యూహెచ్‌వో బృందంలో 10
దేశాల నిపుణులు ఉన్నారు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, నెలల
తరబడి చర్చల తర్వాతే ఈ బృందం పర్యటనకు చైనా అంగీకరించింది. తాము ఊహించినదాని కన్నా
ఎక్కువగానే చైనా అధికారులు తమకు సహకరించారని డబ్ల్యూహెచ్‌వో సభ్యుడు పీటర్
డాస్జాక్ పేర్కొన్నారు. అన్ని కేంద్రాలు, సంస్థలను తమకు
అందుబాటులో ఉంచారని చెప్పారు.
0 Komentar