ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక
- ఈ తేదీలు గుర్తుంచుకోండి
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే బ్రాంచులు, ఏటీఎంల విలీనం పూర్తవ్వగా.. పాత చెక్కుల చెల్లుబాటు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ల విషయంలో మార్పులు జరగనున్నాయి. ఒకవేళ ఈ బ్యాంకుల్లో మీకు ఖాతాలు ఉన్నట్లయితే ఏయే మార్పులు చేసుకోవాలి?
యూనియన్ బ్యాంక్: ప్రభుత్వ రంగ బ్యాంకులైన కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్రాబ్యాంక్‌లో గానీ, కార్పొరేషన్ బ్యాంక్‌లో గానీ మీకు ఖాతా ఉన్నప్పటికీ అకౌంట్ నంబర్ విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే, మీ డెబిట్ కార్డును కూడా ఆ గడువు పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. ఒకవేళ ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను మీరు వాడుతున్నట్లయితే ఇకపై యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్/యాప్‌ను వినియోగించాల్సి ఉంటుంది. లాగిన్/ పాస్‌వర్డ్‌ల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవు. అయితే, ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌కు అవసరమయ్యే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మాత్రం మారనుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు మాత్రమే పాత కోడ్‌లు పనిచేస్తాయి. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త కోడ్స్ అమల్లోకి వస్తాయి. మీ బ్రాంచ్‌ను సంప్రదించి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను తెలుసుకోండి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: దేనా బ్యాంక్, విజయా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. ఒకవేళ మీకు ఈ రెండు బ్యాంకుల్లో ఖాతా ఉన్నట్లయితే మార్చి 1న కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వినియోగంలోకి రానుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు. విలీనమైన బ్యాంకుల తాలుకా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు, చెక్‌బుక్‌లు మార్చి 31 వరకు మాత్రమే పనిచేస్తాయి. ఏప్రిల్ 1 నుంచి మీ దగ్గర ఉన్న పాత చెక్‌బుక్‌ను ఆ లోగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కోసం మీ బ్యాంకును సంప్రదించండి.
0 Komentar