Jeff Bezos Reclaims Title of World’s
Richest After Elon Musk Slips
మళ్లీ ప్రపంచ కుబేర స్థానానికి
బెజోస్
- జాబితాలో కిందకు దిగజారిన ఎలన్ మస్క్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మళ్లీ తొలి స్థానానికి ఎగబాకారు. దాదాపు ఆరు వారాల పాటు నిరాటంకంగా ఆ స్థానంలో కొనసాగిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సంపద తగ్గడంతో బెజోస్ స్థానం మెరుగుపడింది. టెస్లా షేర్లు మంగళవారం 2.6 శాతం కుంగడంతో ఆ సంస్థ ఏకంగా 4.6 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. దీంతో జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన మస్క్ ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బెజోస్ నికర సంపద 191.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మస్క్ కంటే ఆయన 955 మిలియన్ డాలర్ల ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.
అంతకుముందు బెజోస్ 2017 నుంచి తొలి స్థానంలో కొనసాగారు. అమెజాన్ కార్యకలాపాలు, విస్తరిస్తున్న కొద్దీ కంపెనీ షేర్ల విలువ పెరుగుతూ వచ్చింది. దీంతో
కంపెనీలో అతిపెద్ద వాటాదార్లలో ఒకరైన బెజోస్ వ్యక్తిగత సంపద ఎగబాకుతూ వచ్చింది.
వచ్చే ఏడాది అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బెజోస్ ప్రకటించిన
విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన తిరిగి తొలి స్థానానికి ఎగబాకడం గమనార్హం. బెజోస్
స్థానంలో ఆండీ జెస్సీ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. బెజోస్ నేతృత్వంలో ఉన్న బ్లూ
ఆరిజిన్ రాకెట్ కంపెనీ, వాషింగ్టన్ పోస్ట్ మీడియా హౌస్,
బెజోస్ ఎర్త్ వంటి సంస్థలపై మరింత దృష్టి సారించేందుకే ఆయన ఈ
నిర్ణయం తీసుకున్నారు.
0 Komentar