ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లు యథాతథం
ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు, రివర్స్ రెపోరేటులో వరుసగా నాలుగోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ప్రస్తుతం 4 శాతంగా ఉన్న రెపోరేటు.. 3.35 శాతంగా ఉన్న రివర్స్ రెపోరేటు అలాగే కొనసాగనున్నాయి. ఆర్‌బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. వృద్ధి రేటుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. ఇక 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అంచనాలను 5.8 శాతం నుంచి 5.2 శాతానికి సవరించడం గమనార్హం.
ద్రవ్యోల్బణం తిరిగి గాడిలోకి వస్తోందని శక్తికాంతదాస్ తెలిపారు. కొవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొ్న్నారు. మౌలిక, వైద్యారోగ్య రంగాలకు బడ్జెట్ పెద్దపీట వేసిందని ఆయన గుర్తుచేశారు. స్వల్పకాలంలో కూరగాయధరలు అదుపులోనే ఉండే అవకాశం ఉందని తెలిపారు. రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం సజావుగా సాగేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని మే 27న జరగబోయే తదుపరి పరపతి సమీక్ష నాటికి తిరిగి 4 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0.625 శాతం ‘క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చిన గడువును అక్టోబరు 2021వరకు పొడిగించింది. త్వరలో రిటైల్ ఇన్వెస్టర్లను నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్లోకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాధుల పరిష్కారానికి ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీం’ను జూన్ 2021 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కొవిడ్ సృష్టించిన ఆర్థిక
ఇబ్బందులను ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే దిశగానే ఆర్‌బీఐ
నిర్ణయాలు ఉంటాయని గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వ్యవస్థలో నిధులు ఉండేలా
వెసులుబాటు కల్పిస్తూ.. రేపో రేటు, రివర్స్ రెపో రేటును
రిజర్వు బ్యాంకు యథాతథంగా ఉంచిందని పేర్కొన్నారు.
0 Komentar