RBI Puts Rs 1,000 Withdrawal Cap on
Deccan Urban Co-Op Bank; Fresh Loans, Deposits Restricted
ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు - రూ.1000 వరకే నగదు ఉపసంహరణకు అనుమతి
కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కార్యకలాపాలపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది. ఖాతాదారులు రూ.1,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరించుకునేలా పరిమితి విధించింది. అలాగే కొత్తగా రుణాలు ఇవ్వడం, నిధులు సమీకరించుకోవడం, డిపాజిట్లు స్వీకరించడం పూర్తిగా నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించింది. కొత్తగా ఎక్కడా పెట్టుబడులు కూడా పెట్టొద్దని తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా విక్రయించొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు కూడా చేయొద్దని ఆదేశించింది.
అయితే, బ్యాంకు
ఖాతాదారుల్లో 99.58 శాతం మంది ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్
క్రెడిట్ గ్యారంటీ కోఆపరేషన్(డీఐసీజీసీ)’ కింద నమోదై ఉన్నారని.. వారందరికీ బీమా
రూపంలో భద్రత లభిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆంక్షలు విధించినంత మాత్రాన బ్యాంకు
లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే
వరకు కొన్ని పరిమితులు కొనసాగుతాయని తెలిపింది. పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు
ఆంక్షల్లో సడలింపులిస్తామని పేర్కొంది. తాజాగా విధించిన ఆంక్షలు ఫిబ్రవరి 19 సాయంత్రం నుంచి మొదలై ఆరు నెలల పాటు కొనసాగుతాయని వెల్లడించింది.
0 Komentar