SBI Payments to Launch YONO Merchant App
వ్యాపారుల కోసం ఎస్‌బీఐ ప్రత్యేక
యాప్!
తమ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ పేమెంట్స్
ద్వారా వ్యాపారుల కోసం త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు ఎస్‌బీఐ
శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే మనుగడలో ఉన్న బ్యాంక్ యాప్ ‘యోనో’ బ్రాండ్‌ను
విస్తరిస్తూ ‘యోనో మర్చంట్ యాప్’ పేరిట దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు
వెల్లడించింది. ఈ యాప్ ద్వారా వ్యాపారులు సులభంగా చెల్లింపులు స్వీకరించే అవకాశం
కలుగుతుందని తెలిపింది. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండుకోట్ల మంది చిరు, మధ్యశ్రేణి
వ్యాపారులకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
ఈ యాప్ వల్ల దేశంలోని టైర్-3, 4 పట్టణాలకూ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ విస్తరిస్తుందన్న విశ్వాసం
వ్యక్తం చేసింది. ‘పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్)’గా పనిచేయనున్న ఈ యాప్‌ను
అంతర్జాతీయ పేమెంట్స్ టెక్నాలజీ దిగ్గజం వీసా భాగస్వామ్యంతో తీసుకొస్తున్నట్లు
పేర్కొంది. భవిష్యత్తులో దీన్నే జీఎస్టీ ఇన్‌వాయిసింగ్, సరకు
నిర్వహణ సహా ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే బహుళ ప్రయోజన సాధనంగా
మారుస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. దేశంలోని మారుమూల
ప్రాంతాలకూ పీవోఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్‌బీఐ లక్ష్యానికి
అనుగుణంగానే దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
0 Komentar