టిఎస్: ఫిబ్రవరి 22 నుంచి అన్ని మెడిసిన్ కోర్సుల ప్రాక్టికల్స్ ప్రారంభం - కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఈసీ తీర్మానం
ఎంబీబీఎస్, దంత,
ఆయుష్, నర్సింగ్, పారామెడికల్
తదితర అన్ని కోర్సులకు ఫిబ్రవరి 22 నుంచి ప్రాక్టికల్స్
తరగతులను ప్రారంభించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ప్రస్తుతం
అన్ని సంవత్సరాల విద్యార్థులకూ ఆన్‌లైన్‌లో థియరీ తరగతులు కొనసాగుతుండగా.. 2019-20లో ప్రవేశం పొందిన తొలి ఏడాది విద్యార్థులకు, ఈ
ఏడాదితో తుది సంవత్సరం పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు మాత్రమే ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ తరగతులను ప్రారంభించారు. ఫిబ్రవరి 22 నుంచి మిగిలిన అన్ని సంవత్సరాల విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్
తరగతులు నిర్వహించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా తీర్మానించింది. థియరీ
తరగతుల్ని మాత్రం ఇప్పటి మాదిరే మరి కొంత కాలం ఇలాగే కొనసాగించనున్నారు. ఈ మేరకు
ఫిబ్రవరి 19న వరంగల్‌లో నిర్వహించిన కాళోజీ ఆరోగ్య
విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక కమిటీ(ఈసీ) సమావేశంలో తీర్మానించారు. ఇందులో ఆరోగ్య
వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి, వైద్యవిద్య
సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు
డాక్టర్ జి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
‣ బ్యాచ్‌ల వారీగా
* ఫిబ్రవరి 22 నుంచి ప్రాక్టికల్స్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినా, తల్లిదండ్రుల అనుమతి పత్రం, కొవిడ్ పరీక్షలు
తప్పనిసరి కావడంతో కళాశాలలు దశల వారీగా తరగతులను ప్రారంభించుకోవడానికి వెసులుబాటు
ఉంటుంది.
* అన్ని కోర్సుల్లో 55 వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నందున బ్యాచ్‌ల వారీగా విభజించి
అనుభవపూర్వక పాఠాలు బోధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని కళాశాలలకే స్వీయ
నియంత్రణాధికారాలను అప్పగించనున్నారు.
* ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలన్నింటిలోనూ డిజిటల్ తరగతుల విధానాన్ని మరో 2 నెలల్లో అమలుచేయాలి. ఈ విధానాన్ని అధ్యయనం చేయడానికి టిమ్స్ సంచాలకులు
విమలాథామస్ నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ డిజిటల్ పాఠాలపై అధ్యయనం
చేసి 2 వారాల్లో నివేదికను కాళోజీ వర్సిటీకి సమర్పిస్తుంది.
* గాంధీ వైద్యకళాశాలలో
ఇప్పటికే డిజిటల్ విధానం అమల్లో ఉండగా, రాష్ట్రంలోని
మిగిలిన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో డిజిటల్ తెరలను కాళోజీ వర్సిటీ నెలకొల్పుతుంది.
ప్రైవేటు వైద్యకళాశాలలు మాత్రం సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి.
* డిజిటల్ తరగతులు
అందుబాటులోకి రావడం ద్వారా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సదస్సులు,
కార్యశాలలు, బోధనలను నేరుగా విద్యార్థులు
వినడానికి అవకాశాలుంటాయి.
* ఈ-గ్రంథాలయాన్ని కూడా
త్వరగా నెలకొల్పడానికి కాళోజీ వర్సిటీ ఈసీ ఆమోదముద్ర వేసింది. వైద్యవిద్య
మెరుగుదలకు ఇది దోహదపడుతుందని కాళోజీ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి
తెలిపారు.
0 Komentar