మార్చి 31నుంచి
ఇంటర్ ప్రాక్టికల్స్ - 947 కేంద్రాల్లో పరీక్షలు
కోవిడ్ నేపథ్యంలో పటిష్ట నిబంధనలు
రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు (ఆదివారాలతో సహా) జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లల్లో జరుగుతాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వి. రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్స్ కోసం ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 947 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు గతేడాది ఏర్పాటు చేసిన కేంద్రాల కన్నా ఈసారి 42 పెంచినట్లు వివరించారు. ఈ పరీక్షలకు ఎంపీసీ స్ట్రీమ్ లో 2 లక్షల 60 వేల 12 మంది, బైపీసీ నుంచి 98 వేల 462 మంది విద్యార్థులు హాజరవుతారని, మొత్తం 3 లక్షల 58 వేల 474 మందికీ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లను నియమిస్తున్నామన్నారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు.
ప్రతి రోజూ సెషన్ల వారీగా చీఫ్
సూపరింటెండెంట్ల మొబైల్ ఫోన్లకు ఓటీపీ వస్తుందని, దానితో మాత్రమే
ప్రశ్నాపత్రాలను తెరవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెం డెంట్లు
మినహా సిబ్బంది, విద్యార్థులెవరూ సెల్ ఫోన్లు
తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఇంటర్ వెబ్ సైట్ లో
అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కొవిడ్ తో చికిత్స పొందుతున్న
విద్యార్థులకు తర్వాతి బ్యాచ్ విద్యార్థులతో కలిపి పరీక్షలు నిర్వహించడం
జరుగుతుందని వివరించారు. 20 మంది బ్యాచ్ లో పది మంది చొప్పున
మాత్రమే ల్యాబ్ లకు అనుమతించడం జరుగుతుందని, కొవిడ్
నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని రామకృష్ణ వెల్లడించారు.
0 Komentar