Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కుటుంబ పింఛను’లో కుమార్తెలకూ వాటా - జీవో 152 రద్దు

 

కుటుంబ పింఛను’లో కుమార్తెలకూ వాటా - జీవో 152 రద్దు

వితంతు, విడాకులైన మహిళలపై హైకోర్టు కీలక తీర్పు

పిటిషనర్లకు పింఛను కొనసాగించాలని ఆదేశం 

ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ తర్వాత కన్నుమూసిన ఉద్యోగులకు సంబంధించిన వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పింఛను పొందేందుకు అనర్హులుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 2019 నవంబరు 25న ప్రభుత్వం జారీ చేసిన జీవో 152ను రద్దు చేసింది. పిటిషనర్లకు గతంలో చెల్లించిన మాదిరిగానే కుటుంబ పింఛను ఇవ్వాలని అలాగే నిలిపివేసిన దగ్గర్నుంచి 6 శాతం వడ్డీతో బకాయిలను 2 నెలల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. 

ఉద్యోగ విరమణ చేసి కన్నుమూసిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైన వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఇచ్చే కుటుంబ పింఛన్‌ విషయంలో అర్హతలను నిర్ణయిస్తూ 2019 నవంబరులో ప్రభుత్వం జీవో 152ను తీసుకొచ్చింది. 45 ఏళ్ల వయసు దాటిన, వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెల పిల్లలు మేజర్లు అయితే కుటుంబ పింఛన్‌ పొందేందుకు అనర్హులుగా జీవోలో పేర్కొన్నారు. ఆ జీవో ఆధారంగా పలువురికి ఆ చెల్లింపులు నిలిపేశారు. దీంతో జీవో 152ను సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు.

న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్న అంశాలు

పింఛన్‌ పొందే అర్హతలను రాజ్యాంగ నిబంధనల ద్వారా కల్పించినప్పుడు కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జీవో జారీ చేయడం ద్వారా అర్హతల్లో మార్పులు చేయడం సరికాదు. ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌-1980 చట్టబద్ధమైనవి. అధికరణ 309ను అనుసరించి రూపొందించారు. 1980నాటి నిబంధనలు వితంతు, విడాకులు పొందిన కుమార్తె పింఛన్‌ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదు. ఈ నేపథ్యంలో జీవో ద్వారా దీనికి అర్హత విషయంలో షరతులు విధించడం తగదు. ఆస్తి హక్కు నుంచి పింఛన్‌ పొందే హక్కును నిరాకరించడానికి వీల్లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ పింఛన్‌ అనేది వ్యక్తిగత ఆస్తి హక్కులో భాగం. చట్టం అనుమతించకుండా.. దీనిని నిలిపివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉల్లంఘించడమే. నిలిపివేసే ముందు పిటిషనర్లకు నోటీసు ఇవ్వలేదు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండి 45ఏళ్ల లోపు వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు జీవో 152 ప్రకారం కుటుంబ పింఛన్‌ పొందేందుకు అర్హురాలిగా పేర్కొన్నారు. 45 ఏళ్లు మించిన వారి పిల్లలకు 18 ఏళ్లు వస్తే అనర్హులన్నారు. ఆ విధంగా వర్గీకరించడానికి వీల్లేదు. 45 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు ఆడపిల్లలుంటే వారికి పెళ్లి చేసే బాధ్యత ఉంటుంది. ఈనేపథ్యంలో 45 ఏళ్లు మించని, మించినవారి మధ్య అర్హతల విషయంలో వివక్ష చూపడం సహేతుకంగా లేదు. అర్హతల విషయంలో జీవో 152 జారీ చేసి.. 2010 అక్టోబర్‌ 7నుంచి అవి వర్తిస్తాయని పేర్కొనడానికి వీల్లేదు. అందువల్ల జీవో 152ను రద్దు చేస్తూ పిటిషనర్లకు కుటుంబ పింఛన్‌ కొనసాగించాలని ఆదేశిస్తున్నాం’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags