తెలుగు, ఆంగ్ల
భాషల్లో డిగ్రీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
డిగ్రీ పాఠ్యపుస్తకాలను
రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి
ఉన్నత విద్యను మొత్తం ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తున్నందున ఆంగ్లం, తెలుగు
భాషలతో కూడిన పుస్తకాలను తీసుకురానుంది. గురువారం జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి
పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాఠ్యపుస్తకంలో ఆంగ్లం పాఠం
పక్కనే తెలుగులో పాఠం ఉంటుంది. డిగ్రీలోని అన్ని కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమం
ప్రవేశపెడుతున్నందున ఆ పాఠ్యాంశాలు అర్థం కానివారు తెలుగులో చదువుకునేందుకు ఈ
విధానం తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో
అమలు చేసిన విధానాన్ని ఉన్నత విద్యలోనూ అమలు చేయనున్నారు. పుస్తకాల పరిమాణం
పెరగకుండా ఉండేందుకు సెమిస్టర్ల వారీగా పుస్తకాలను రూపొందించనున్నారు.
ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా
పాఠ్యప్రణాళికను విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఉన్నత
విద్యామండలి అందిస్తోంది. ఆ పాఠ్యప్రణాళిక ప్రకారం విద్యా సంస్థలు మార్కెట్‌లో
దొరికే ప్రైవేటు సంస్థల పుస్తకాలను వినియోగిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం
నుంచి ఉన్నత విద్యామండలి రూపొందించిన పుస్తకాలు మార్కెట్‌లోకి రానున్నాయి.
సబ్జెక్టుల వారీగా నిపుణులను నియమించుకొని, పుస్తకాలను
రూపొందించడమా? లేదంటే ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రముఖ
ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకొని పుస్తకాలను తీసుకురావడమా? అనేదానిపై కసరత్తు చేస్తోంది. పుస్తకాల రూపకల్పనకు అవసరమయ్యే బడ్జెట్
కోసం ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.
విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు, న్యాక్ గుర్తింపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలతో కూడిన పుస్తకాలను సైతం ఉన్నత విద్యామండలి రూపొందించనుంది.
0 Komentar