టిఎస్: ఈ నెల 10న ఎంసెట్ నోటిఫికేషన్
ఇంజనీరింగ్, ఫార్మసీ,
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ
పరీక్ష (ఎంసెట్) నోటిఫికేషన్ ఈ నెల 10న ప్రకటించాలని ఉన్నత విద్యామండలి
నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి రెండు మాసాల పాటు విద్యార్థుల
నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించాలని మండలి ప్రతిపాదించింది. జూలై
మొదటి వారంలో ఎంసెట్ ను నిర్వహించాలని ఇప్పటికే మండలి తేదీలను ఖరారు చేయగా పరీక్ష
నిర్వహణపై హైదరాబాద్ జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది.
కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 70 శాతం సిలబసను, మొదటి సంవత్సరానికి సంబంధించి వందశాతం సిలబసన్ను పరిగణలోకి తీసుకుని ప్రశ్నాపత్రాన్ని రూపొందించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కొత్తగా కోవిడ్ కేసులు నమోదవుతుండడంతో ఎంసెట్ ను సైతం ఇందుకు సంబంధించిన నిబంధనలకు లోబడి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మండలి ప్రతిపాదించింది. ఎంసెట్ నోటిఫికేషన్ ఇతరత్రా అంశాలకు సంబంధించి సోమవారం మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎంసెట్ దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి ఎన్ని రోజులు విద్యార్ధులకు వ్యవధి ఇవ్వాలి, సిలబస్ ప్రకటన, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, కీ విడుదల, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనపై తేదీలను ఖరారు చేయనున్నామని, టీ ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ వివరించారు.
0 Komentar