పది, ఇంటర్ పరీక్షల
నిర్వహణపై సీఎం సమీక్ష - పాస్ మార్కులతో భవిష్యత్ ఉంటుందా?: సిఎం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ వల్ల జరిగే ప్రయోజనాలు సహా ఏ పరిస్థితుల్లో వీటిని నిర్వహిస్తున్నామనే విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు. ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. నిన్న కేరళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారన్నారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని.. నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినట్లు వివరించారు.
‘‘పరీక్షలతో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కళాశాలల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70శాతం పైగా మార్కులు వస్తే.. అలాంటి వారికే సీట్లు వస్తాయి. కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాం.
పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం.
నిర్వహణ బాధ్యతతో కూడుకున్నది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు
నిర్వహిస్తాం. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పరీక్షలు
నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి టీచర్, తల్లిదండ్రులు
గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు కావాలి.
పరీక్షల నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని సీఎం వివరించారు.
0 Komentar