AP: 18 ఏళ్లు నిండిన వారికి
జూన్ నుంచి టీకాలు - రాష్ట్రంలో మే 1
నుంచి జరగడం లేదు
ప్రైవేటు ఆసుపత్రులకు ‘రెమ్‌డెసివిర్’
రాష్ట్రంలో 18
ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ కార్యక్రమం జూన్ నుంచి మాత్రమే ప్రారంభమయ్యే
అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... 18 ఏళ్లు దాటిన వారంతా టీకా వేయించుకోవడానికి కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్
చేసుకొనేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. టీకా పంపిణీ కోసం తాము సంబంధిత
కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నామని, ఇప్పటివరకు ఒప్పందాలు
జరగలేదన్నారు. వీటిపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం అనివార్యమని తెలిపారు. ఈ
కారణంగానే మే 1వ తేదీ నుంచి మాత్రం 18
సంవత్సరాలు దాటిన వారికి టీకాల పంపిణీ జరగదని, పేర్ల నమోదు
సమయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో 50 మంది పాల్గొనడానికే అనుమతి
ఉంటుందని సింఘాల్ ప్రకటించారు. ఈ విషయంలో జిల్లా అధికారులు అవసరమైన చర్యలు
తీసుకుంటారన్నారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులు మూసేసినట్లు తెలిపారు.
కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్
ఇంజెక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకూ అందిస్తామని
సింఘాల్ వెల్లడించారు. వాటిని నల్లబజారులో విక్రయించకుండా రోగులకు
త్వరితంగా అందించాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా
అధికారులు అనుమతినిచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల వారు జిల్లాల్లో ఉండే ఔషధ నియంత్రణ
అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇలా సోమవారం 11,453 ఇంజెక్షన్లు
ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేశామన్నారు. సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో
ఉంచుతామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 32,810
ఇంజెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఈవారంలోగా మరో 50 వేలు
వస్తాయని, తాము 4 లక్షల ఇంజెక్షన్లకు
ఆర్డర్లు పెట్టినట్లు సింఘాల్ వివరించారు. రెమ్‌డెసివిర్ అక్రమ విక్రయాల్లో
ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయముంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
0 Komentar