విద్యాదీవెన తొలివిడత నేడు - 28న వసతిదీవెన తొలివిడత
జగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ ఆన్‌లైన్ ద్వారా రూ.671.45 కోట్లను విడుదల చేస్తారు. 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందుతారు. రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా బోధనా రుసుముల్ని కళాశాలల యాజమాన్యాలకు బదులుగా విద్యార్థుల తల్లులు/ సంరక్షకుల ఖాతాలో జమచేయనుంది. ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల సేకరణను సాంఘిక సంక్షేమశాఖ పూర్తిచేసింది. బోధనా రుసుముల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తే ఫీజులు చెల్లించేందుకు ఏటా నాలుగుసార్లు కళాశాలకు వెళ్తారని, అక్కడ సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలించి యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో బోధనా రుసుముల్ని విడుదల చేయనుంది. సోమవారం తొలివిడత, జులైలో రెండు, డిసెంబరులో మూడు, ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులు జమచేస్తుంది.
28న వసతిదీవెన తొలివిడత
సాయం: జగనన్న వసతిదీవెన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం ఈ నెల 28న విడుదల చేయనుంది. డిసెంబరులో రెండో విడత విడుదల చేస్తామని సంక్షేమ
క్యాలెండర్‌లో ప్రకటించింది. వసతిదీవెన ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే వారికి రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం ప్రభుత్వం
అందిస్తోంది. బోధనారుసుములు, ఉపకార వేతనాల బకాయిలు రూ.1,880 కోట్లు ఉండగా, ప్రభుత్వం గత విద్యాసంవత్సరంలో
విడుదల చేసింది. ఇప్పటివరకూ మొత్తం రూ.4,879.30 కోట్ల బోధన
రుసుములు, ఉపకారవేతనాల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
విద్యాదీవెనకు సంబంధించి రూ.671.45 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ సాంఘిక, బీసీ,
మైనార్టీ సంక్షేమ శాఖలు పాలనా అనుమతులు జారీ చేశాయి. బీసీ
సంక్షేమశాఖ రూ.491.42 కోట్లు, సాంఘిక
సంక్షేమశాఖ రూ.119.25 కోట్లు, గిరిజన
సంక్షేమశాఖ రూ.19.10 కోట్లు, మైనార్టీ
సంక్షేమశాఖ రూ.41.68 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపాయి.
విద్యాదీవెన విడుదల సందర్భంగా అధికారులు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ
స్థాయిలోనూ ఎమ్మెల్యేలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని ఏదైనా
కళాశాలల్లో కార్యక్రమం నిర్వహిస్తారు.
0 Komentar