TS: రూ.2వేల కోట్లతో బృహత్తర విద్యా పథకం - మార్గదర్శకాల
రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశాలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఇందుకోసం ఏడాదికి రూ.2వేల కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) వెల్లడించింది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంగ్ల మాధ్యమంలో గురుకులాలను ఏర్పాటు చేశామని కమిటీ పేర్కొంది. నాణ్యమైన విద్య అందినప్పుడే మానవవనరులు అభివృద్ధి చెందుతాయనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం
కలిగించాలన్న ఆలోచనతో నాణ్యమైన విద్య అందించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు
చేపట్టినట్లు ఉపసంఘం వెల్లడించింది. బంగారు తెలంగాణ లక్ష్యసాధన కోసం
విద్యావిధానాన్ని ఒక సాధనంగా చేసుకొని ముందుకెళ్తామని,
ప్రాథమిక విద్యారంగం పటిష్టతతోనే ఉన్నతవిద్య సమర్థంగా అమలవుతుందనేది ప్రభుత్వ భావన
అని తెలిపింది. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగాన్ని ఉత్తమంగా
తీర్చిదిద్దుతున్నామని.. అందుకోసం విద్యారంగంపై అధిక నిధులు ఖర్చు చేయబోతున్నట్లు
తెలిపింది. పాఠశాలల్లో అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు లాంటి మౌలిక సదుపాయాలు
సంపూర్ణంగా ఏర్పాటు చేయనున్నట్లు సబ్‌కమిటీ వివరించింది. ఈ మేరకు ఏటా రూ.2వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తుది మార్గదర్శకాలు
రూపొందించాలని అధికారులను ఆదేశించింది. వాటిని ముఖ్యమంత్రికి నివేదిస్తామని
తెలిపింది.
0 Komentar