విద్యా విధానం సరికొత్తగా - ప్రీ ప్రైమరీ, అప్పర్, హైస్కూళ్లుగా
విభజన
వ్యయం, పర్యవసానాలపై
మదింపునకు ఆదేశం
మండలాల్లో ఒకటి లేదా రెండు
కళాశాలలు
‘పిల్లల్లో ఆరేళ్ల వయసులోనే 80 శాతం మేధో వికాసం చెందుతుంది. పేద పిల్లలకు కూడా అత్యుత్తమ విద్య అందించాలనే ఆలోచనతోనే వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు పుట్టుకొచ్చాయి. మీరు తయారుచేసిన ప్రతిపాదనల వల్ల ఎంత వ్యయం అవుతుంది? విద్యాపరంగా ఎలాంటి ప్రభావం పడుతుందో లోతుగా అధ్యయనం చేయండ’ని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా విధానంలో సంస్కరణలపై మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనితతో కలిసి సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం చర్చించారు. ఈ ప్రతిపాదనలపై గతంలోనూ చర్చించగా తాజాగా మరోసారి సమీక్షించారు. ఇవి అమలులోకి వస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో కూలంకషంగా పరిశీలించాలని సూచించారు. విద్యా, మహిళా సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖల అధికారులు రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, కృతికా శుక్లా, ఏఆర్ అనూరాధ, గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే…
* ‘వైఎస్సార్ ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ విద్యార్థులకు కిలోమీటరు దూరంలోనే ఉండాలి. 3 నుంచి 10 లేదా 12 తరగతులకు ఉద్దేశించిన హైస్కూళ్లు మూడు కిమీ దూరంలో ఉండేలా మ్యాపింగ్ చేయాలి. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకునేలా హేతుబద్ధీకరించాలి. తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించవచ్చు. తాజా ప్రతిపాదనలను అమలు చేయాల్సి వస్తే తొలుత 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంద’ని సీఎం పేర్కొన్నారు.
* ‘ప్రీ ప్రైమరీ-1, 2, ప్రిపరేటరీ 1, 2 తరగతులకు కలిపి ఏర్పాటు చేసే ఫౌండేషన్ స్కూళ్లలో డిజిటల్ బోధన పద్ధతులపై దృష్టి సారించాలి. మున్ముందు డిజిటల్ బోర్డులకు వెళ్లాల్సి వస్తుంది. అందుకు అవసరమైన విద్యా ఉపకరణాలను నాణ్యమైనవి, దీర్ఘకాలం మన్నేవి ఎంచుకోవాలి. ఎన్ని స్కూళ్లలో ఎన్ని డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయమవుతుందో అధ్యయనం చేయాలి’ అని ఆదేశించారు..
అధికారులు ప్రతిపాదనలివి
* అంగన్‌వాడీ కేంద్రాలను
ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలి. ప్రీ ప్రైమరీ 1, 2, ప్రిపరేటివ్
(ఒకటో తరగతికి సన్నద్ధత) 1, 2 తరగతులు కలిపి వైఎస్సార్ ప్రీ
ప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లుగా ఏర్పాటు చేయాలి.
* 3, 4, 5 తరగతులను
సమీపంలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు తరలించి వాటిని హైస్కూళ్లుగా
ఉన్నతీకరిస్తారు. ప్రతి మండలంలో ఒకటో, రెండో జూనియర్
కళాశాలలు నెలకొల్పుతారు. ఇందులో భాగంగానే హైస్కూళ్లలో 11, 12
తరగతులు బోధించడమా? లేక విడిగా కొత్తగా జూనియర్ కళాశాలలు
నెలకొల్పాలా? అన్నది పరిశీలించాలి.
* ఫౌండేషన్ స్కూళ్లలో
పాఠ్యాంశాలు, సమగ్ర బోధన పద్ధతులు, నైఫుణ్యం
స్థాయి పెంపు, మల్టీ లెవల్ బోధనపై దృష్టి సారించాలి.
* ప్రాథమిక పాఠశాలల్లోని 3,
4, 5 తరగతులను దగ్గరల్లోని యూపీ స్కూళ్లకు తరలించి వాటిని
హైస్కూళ్లుగా ఉన్నతీకరించాలి. అవసరాల మేరకు తరగతి గదులు నిర్మించాలి.
* ఫౌండేషన్ స్కూళ్ల
ఏర్పాటు ద్వారా అంగన్‌వాడీ టీచర్లను ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకురావాలి. వారు తగిన
సామర్థ్యం పొందేలా శిక్షణ ఇవ్వాలి. పదోన్నతుల ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ
గ్రేడ్ టీచర్లుగా నియమించాలి.
* అంగన్‌వాడీ కేంద్రాల
ద్వారా చేపడుతున్న ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్,
అర్బన్ క్లినిక్‌లకు బదలాయించాలి. ఆరోగ్యం, పౌష్టికాహారంపై
అవగాహన, ఆరోగ్య పరిశీలన, వ్యాక్సినేషన్,
రెఫరల్ సర్వీసులన్నీ ఈ క్లినిక్‌ల పరిధిలోకి మార్చాలి.
0 Komentar