Bharat Biotech begins trials for 'third'
booster dose of Covaxin at AIIMS
Covaxin: బూస్టర్ డోసు
ప్రయోగాలు ప్రారంభం!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తేలింది. అయినప్పటికీ కొత్తరకాలు వెలుగు చూడడం, వ్యాక్సిన్‌ల వల్ల పొందే రోగనిరోధక సామర్థ్యం కొంతకాలం వరకే పరిమితమవుతుందన్న నిపుణుల అంచనాలతో బూస్టర్ డోసుల అవసరం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సంస్థలు ఇప్పటికే వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ బూస్టర్ డోసు ప్రయోగాలను భారత్ బయోటెక్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 190 మందిపై ఆరు నెలలపాటు అధ్యయనం చేపట్టనున్నారు.
వ్యాక్సిన్ మూడో డోసు (Booster Dose) ఫలితాలను తెలుసుకునేందుకు నడుం బిగించిన భారత్ బయోటెక్.. సోమవారం నాడు దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రయోగాలను మొదలుపెట్టింది. ఇందుకోసం రెండు, మూడో దశల ప్రయోగాల్లో భాగంగా (6 నెలల క్రితం) వ్యాక్సిన్ తీసుకున్న 190 మందిపై ప్రయోగాలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాల్లో బూస్టర్ డోసు ప్రయోగాలను చేస్తున్నట్లు ప్రయోగ నిర్వాహకులు వెల్లడించారు. 18 నుంచి 55 మధ్య వయసున్న 190 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలను చేపడుతున్నట్లు తెలిపారు. మూడో డోసు తీసుకున్న తర్వాత మరో 6 నెలల పాటు వీరిపై పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
బూస్టర్ డోసు ప్రయోగాల కోసం
సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) నుంచి భారత్ బయోటెక్ ఇప్పటికే అనుమతి
పొందింది. ప్రయోగాల్లో భాగంగా కొవాగ్జిన్ రోగనిరోధక సామర్థ్యం, దుష్ర్పభావాలు,
వ్యాక్సిన్ సురక్షితం తదితర అంశాలను అంచనా వేయనున్నారు. ఇక జనవరి 16న ప్రారంభమైన కొవాగ్జిన్ టీకా పంపిణీలో ఇప్పటివరకు 2కోట్ల డోసులను అందించినట్లు సమాచారం.
0 Komentar