EPFO Allows Members to Avail Second
Covid-19 Advance
ఈపీఎఫ్‌వో: మళ్లీ కొవిడ్
అడ్వాన్స్ తీసుకునే అవకాశం - కార్మికశాఖ వెల్లడి
దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతితో చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఆంక్షల ఛట్రం కిందకు వెళ్లాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించాయి. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకోడానికి ముందుకొచ్చింది ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో). ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు మరోసారి వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘‘కరోనా రెండో దశ ఉద్ధృతిలో
ఖాతాదారులకు అండగా ఉండేందుకు రెండోసారి నాన్ రిఫండబుల్ కొవిడ్ అడ్వాన్స్
తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రత్యేక నిబంధనను గతేడాది మార్చిలో
ప్రకటించాం’’ అని కార్మికశాఖ ప్రకటించింది. గతేడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
విధించడంతో అనేక సంస్థలు మూతబడ్డాయి. దీంతో వేతనజీవుల ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్‌వో
ఈ సదుపాయాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులు మూడు నెలల బేసిక్, డీఏ జీతాన్ని లేదా భవిష్యనిధిలోని 75శాతం
డబ్బును(ఏదీ తక్కువైతే అది) అడ్వాన్స్‌గా తీసుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పుడు
మరోసారి ఆ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నవారు
రెండోసారి కూడా అడ్వాన్స్ తీసుకోవచ్చని ప్రకటించింది.
సాధారణంగా వైద్యం, పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు వంటి అవసరాల కోసం ఈపీఎఫ్‌వో ఖాతాదారులు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే వీలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొవిడ్ కారణంతో కూడా అడ్వాన్స్ పొందే అవకాశం లభించింది. ‘‘మహమ్మారి సమయంలో వేతన జీవులకు ముఖ్యంగా రూ. 15వేల లోపు నెలజీతం ఉన్నవారికి ఈ కొవిడ్ అడ్వాన్స్ ఎంతగానో ఉపయోగపడుతోంది. గతేడాది ఈ సదుపాయాన్ని తీసుకురాగా.. ఇప్పటివరకు 76.31లక్షల మంది కొవిడ్ అడ్వాన్స్ పొందారు. ఇందుకోసం రూ. 18,698.15కోట్లను ఈపీఎఫ్‌వో చెల్లించింది’’అని కార్మికశాఖ పేర్కొంది. అంతేగాక, అత్యవసరం దృష్ట్యా కొవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో మూడు రోజుల్లోనే పరిష్కరిస్తోందని వెల్లడించింది.
#EPFO allows its members to avail second COVID-19 advance. Members who have already availed the first #COVID-19 advance can now opt for a second advance also.#Unite2FightCorona https://t.co/C1CVZOmCXr pic.twitter.com/TCYqtyOM5E
— Ministry of Labour (@LabourMinistry) May 31, 2021
0 Komentar