కోవిడ్ బాధితుల ‘కేర్ టేకర్లు’ గా
ఉపాధ్యాయులు
కోవిడ్ బాధితుల కేర్ టేకర్లుగా
ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పజెబుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు జిల్లాలోని ఉపాధ్యాయుల ఫోన్లకు వ్యక్తిగతంగా సందేశాలు వెళ్తున్నాయి. ప్రతి
ఉపాధ్యాయుడికీ ఒక కరోనా బాధితుడి బాగోగులను పరిశీలించే బాధ్యతను అప్పజెప్పింది
జిల్లా యంత్రాంగం. ఫోన్ ద్వారా 14 రోజుల పాటు కోవిడ్ బాధితుల ఆరోగ్య వివరాలపై ఆరా
తీసి,
వాటిని గూగుల్ షీట్‌లో నింపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానోపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ల వరకు అందరికీ బాధ్యతలు
అప్పగించింది. ఇలా చేయడం వల్ల రోగులపై పర్యవేక్షణ బాగా ఉంటుందనేది యంత్రాంగం యోచన.
ఏ ఉపాధ్యాయుడు ఎవరి వివరాలు సేకరించి జిల్లా యంత్రాంగానికి అందజేయాలో కూడా
ఉపాధ్యాయుల చరవాణికి సంక్షిప్త సమాచారం పంపారు. అప్పగించిన రోగుల వివరాలను వీరు
ఫోన్లో ఆరా తీసి ప్రతి రోజూ నిర్దేశిత నమూనాలో జిల్లా యంత్రాంగానికి ఆన్లైన్లో
చేరవేయాలి.
ఏ టీచరు కూడా రోగి వద్దకు
వెళ్లాల్సిన అవసరం లేదు. నిర్దేశిత సమాచారాన్ని ఫోన్లో సేకరించి ఇస్తే సరిపోతుంది.
రోగి పేరు, ఏం మందులు వాడుతున్నారు, హోం
ఐసోలేషన్ కిట్ అందిందా లేదా? ఏం మందులు వేసుకున్నారు,
ఏం ఆహారం తీసుకున్నారు, ఏఎన్ఎం వచ్చి ఏమైనా
పరిశీలించారా? వేడి నీళ్లు తాగుతున్నారా లేదా? ఏదైనా సమస్య వస్తే వెంటనే 104కు కాల్ చేసి చెప్పేలా రోగులకు ధైర్యవచనాలు
చెప్పేలా ఈ వివరాల సేకరణకు యంత్రాంగం రూపకల్పన చేసింది. జిల్లాలో 10వేల మందికి
పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక్కో టీచర్ ఒక్కో రోగి వివరాలు సేకరించడం వల్ల ప్రతి
రోజూ వారి ఆరోగ్య సమాచారం జిల్లా యంత్రాంగానికి తెలుస్తుంది. ఎవరికైనా సీరియస్
అయితే వారికి అవసరమైన అత్యవసర వైద్యం అందించడానికి ఈ ముందస్తు సమాచారం
ఉపయోగపడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
14 రోజుల పాటు ఈ వివరాలు సేకరించి అందజేయాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ వర్గాలు
తెలిపాయి.
ప్రతి టీచర్ ఏ రోజుకారోజు
సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ
వివరాల సేకరణ పై కొందరు ఉపాధ్యాయులు ఇది సామాజిక బాధ్యత అని రోగుల ఆరోగ్యం గురించి
తెలుసుకుని యంత్రాంగానికి నివేదించడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
సమయానికి మందులు వేసుకోవాలని సూచించడం, మంచి ఆహారం తీసుకోవాలని
చెప్పడం వంటివి చేయడం ద్వారా బాధితులకు భరోసా ఉంటుందన్నారు.
0 Komentar