Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

బయో బబుల్‌ అంటే ఏమిటి ? IPL UAE నిర్వహణ సమయం లో రాని సమస్య భారత్ లో ఎలా వచ్చింది?

 

బయో బబుల్‌ అంటే ఏమిటి ? IPL UAE నిర్వహణ సమయం లో రాని సమస్య భారత్ లో ఎలా వచ్చింది?  

బయో బబుల్ అంటే..ముందుగా 7 రోజుల క్వారంటైన్, మరింత తరచుగా కోవిడ్ పరీక్షలు చేయటం, కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడం. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు, ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ బయట వారి తో కాంటాక్ట్ లో లేకుండా చూస్తారు.

ఇలా బయో బబుల్ తో ఫుట్ బాల్, ఐస్ హాకీ, బాస్కెట్ బాల్,  రెస్లింగ్ మరియు క్రికెట్ చాలా చోట్ల ఈ కరోనా సమయం లో నిర్వహించారు. 

అమెరికా లో ఐతే క్రీడల నిర్వహణే కాకుండా, సినిమా షూటింగ్ లో కూడా ఈ బయో బబుల్ ని వాడారు. 

IPL బయో బబుల్‌ వివరాలు: 

ఐపీఎల్‌-2021 బయో బబుల్‌ మధ్య నిర్వహిస్తున్నా సరే, లీగ్‌ మధ్యలో కరోనా కేసులు ఎలా వెలుగు చూశాయన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. గత ఏడాది యూఏఈలో ఎంతో పకడ్బందీగా బుడగను ఏర్పాటు చేసి రెండు నెలల పాటు విజయవంతంగా లీగ్‌ను నిర్వహించారు.

లీగ్‌ ఆరంభానికి ముందు కొన్ని కేసులు వెలుగు చూసినా, అవి ఆటగాళ్లు, సిబ్బంది క్వారంటైన్‌ ప్రక్రియ మొదలు కావడానికి ముందే, విమాన ప్రయాణాల కారణంగా బయటపడ్డవి. అంతటితో వైరస్‌కు అడ్డుకట్ట వేశారు. లీగ్‌ మొదలయ్యాక వైరస్‌ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి బబుల్‌ బాధ్యతలు అప్పగించారు. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు, ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ (ఉమ్మడి బయో బబుల్‌) బుడగలోకి తీసుకొచ్చారు. బయటి వ్యక్తులు ఎవ్వరూ బుడగ లోపలికి రాకుండా చూసుకున్నారు. అలాగే మూడు వేదికలకే మ్యాచ్‌లు పరిమితం చేయడం, విమాన ప్రయాణాల అవసరం లేకుండా రోడ్డు మార్గాల్లోనే ఒక వేదిక నుంచి మరో వేదికకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా ఎవరికీ వైరస్‌ సోకకుండా చూసుకున్నారు.

అయితే ఇప్పుడు స్వదేశంలో అంత పకడ్బందీగా బబుల్‌ లేకపోవడం వల్లే లీగ్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నది స్పష్టం. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బయో బబుల్‌ ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. ఆయా ఫ్రాంఛైజీలు తమ తమ పరిధిలో బబుల్‌ ఏర్పాటు చేసుకున్నాయి.

కారణాలు:

మైదానాలకు, జట్లు బస చేసే హోటళ్లకు మధ్య ఎక్కువ దూరం ఉండటం, హోటళ్ల సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటం, వారికి నిర్బంధ క్వారంటైన్‌ లేకపోవడం, అలాగే మైదానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎవరూ బబుల్‌ నిబంధనలు పాటించకపోవడం లాంటి లోపాల గురించి ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతోంది. లీగ్‌ను ఒకట్రెండు వేదికలకు పరిమితం చేయకుండా, ఆరు నగరాలను ఎంపిక చేయడంతో మధ్యలో మూడుసార్లు ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చెన్నై, ముంబయిల్లో మ్యాచ్‌లు అయ్యాక అందరూ ప్రయాణాలు చేసిన కొన్ని రోజులకే కరోనా కేసులు బయటపడటాన్ని బట్టి ఆ సమయంలోనే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉంటుందని స్పష్టమవుతోంది.

కోల్‌కతా ఆటగాడు వరుణ్‌ చక్రవర్తి మధ్యలో మోకాలి గాయానికి స్కానింగ్‌ తీసుకోవడానికి బబుల్‌ను వీడి వెళ్లాడు. తిరిగి బబుల్‌లోకి వచ్చాక క్వారంటైన్‌కు వెళ్లకుండా జట్టుతో కలిసి మ్యాచ్‌లు ఆడేశాడు. అతడితో పాటు జట్టు సభ్యుడు సందీప్‌ వారియర్‌ పాజిటివ్‌గా తేలడంతో ముందుగా లీగ్‌లో సమస్య మొదలైంది. తర్వాతి 24 గంటల్లో చెన్నై, సన్‌రైజర్స్‌ జట్లలోనూ కేసులు బయటపడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌ నిర్వాహకుల్లో కరోనా పట్ల భయం తగ్గి, నిర్లక్ష్యం పెరిగిందన్నది స్పష్టం! బయో బబుల్‌ను పకడ్బందీగా లేకపోవడమే లీగ్‌ను ఇలా మధ్యలో ఆపేయక తప్పని పరిస్థితి తలెత్తింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags