ఇక డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు -
2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ!
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో
2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు
తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి
మారిపోనున్నాయి. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో
తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల
మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల
చేసింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆంగ్లంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు
పేర్కొంది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు
మాధ్యమం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.
ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని
పేర్కొంది.
కొత్తగా చేరే వారికే ఆంగ్ల మాధ్యమం
ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న
65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం
అమలవుతుంది.
0 Komentar