APPSC: గ్రూప్-1 ఇంటర్వ్యూలపై స్టే - రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూ
ప్రక్రియ వాయిదా
గ్రూప్-1 ఇంటర్వ్యూ పక్ర్రియను నాలుగు వారాలపాటు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన ఎనిమిది వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని వాదించారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం
దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిన్న తీర్పును
రిజర్వులో ఉంచింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే
విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ -1 ఇంటర్వ్యూలను నాలుగు వారాలపాటు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ.. ఇంటర్వ్యూల
తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
0 Komentar