గ్రూప్-1 మినహా ‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు -త్వరలో అధికారిక ప్రకటన
ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ
నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను
(ప్రాథమిక పరీక్ష) తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు ప్రస్తుతం
జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణ కేంద్రాల్లోనే గడపాల్సి
వస్తోంది. అలాగే ఫీజుల పేరుతో వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అందువల్ల గ్రూప్-2, గ్రూప్-3, ప్రభుత్వ
పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్
కళాశాలల అధ్యాపకులు, కొన్ని ఇంజినీరింగ్ ఉద్యోగాలకు
ప్రిలిమ్స్, మెయిన్స్ అని లేకుండా గతంలో మాదిరిగా ఒకే రాత
పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ అంశంపై కొంతకాలం క్రితం
ఏపీపీఎస్సీలో చర్చ జరిగింది. గ్రూపు-1 మినహా మిగిలిన ఉద్యోగాలకు
2016 ముందు వరకు ఒకే పరీక్ష నిర్వహించేవారు. అయితే ఒకే
పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతున్నప్పుడు అభ్యర్థుల్లో సీరియస్‌నెస్ కనిపించేది
కాదని, లక్షల మంది దరఖాస్తు చేస్తున్నా పరీక్షలు రాయడం లేదని,
కేంద్రాల ఎంపిక, పరీక్షల నిర్వహణకు అధిక సమయం
వెచ్చించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రిలిమ్స్ విధానాన్ని ఏపీపీఎస్సీ 2016 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుత విధానంపై
సమీక్ష జరిపింది.
గ్రూప్-2, 3 వంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి అర్హత సాధించిన వారిని నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్యను అనుసరించి 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మౌఖిక పరీక్షలను చేపట్టి ఫలితాలు ప్రకటిస్తున్నారు అయితే... ఒక నోటిఫికేషన్ అనుసరించి నియామకాలు పూర్తి చేసేందుకు ఒకటి రెండు సంవత్సరాలు పడుతోంది. కొన్నిసార్లు నియామకాలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతోంది. ఇలాంటి అంశాలతోపాటు అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతోందంటూ వచ్చిన అభ్యర్ధనలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
నార్మలైజేషన్’తో ఇబ్బందుల్లేకుండా…
ఈ పరిస్థితుల్లో ఒకే సిలబస్‌ను
అనుసరించి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తున్నప్పుడు ఒకే రాత
పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఒకే పరీక్ష
పద్ధతిని అనుసరిస్తే అభ్యర్థుల సంఖ్య మేరకు 2, 3 రోజులపాటు
పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కొందరికి ప్రశ్నలు
సులువుగా..మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులకు నష్టం
జరగకుండా వారి ప్రతిభను గుర్తించేందుకు ‘నార్మలైజేషన్’ విధానాన్ని అనుసరించాలని
భావిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇదే విధానాన్ని
అనుసరిస్తుండటం గమనార్హం.
0 Komentar