Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Centre Issues Guidelines for Protection of Children Affected by Covid-19

 

Centre Issues Guidelines for Protection of Children Affected by Covid-19

కరోనా: చిన్నారుల సంరక్షణపై కేంద్రం మార్గదర్శకాలు - అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో కరోనా కారణంగా దాదాపు 1882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. ఇక తల్లి దండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7464కు చేరింది. ఇలా ఏడాది కాలంలో దాదాపు 9346 మంది పిల్లలు కరోనా విలయానికి బాధితులుగా మిగిలిపోయారు. ఇలాంటి సమయంలో వీరితో పాటు కొవిడ్‌ బారినపడిన వారి పిల్లల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. కరోనా వైరస్‌ వల్ల ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని తెలియజేస్తూ కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామ్‌ మోహన్‌ మిశ్రా అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలు, కలెక్టర్లు, పోలీస్‌, పంచాయితీరాజ్‌తో పాటు పట్టణ స్థానిక సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మార్గదర్శకాలు

* కరోనాతో తల్లిదండ్రులను కోల్పోవడంతో కుంగుబాటులో ఉన్న చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలి. ఇలాంటి ప్రతి చిన్నారి ప్రొఫైల్‌తో పాటు వారి అవసరాలను డేటాబేస్‌లో పొందుపరచాలి. అనంతరం వాటిని ట్రాక్‌ చైల్డ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

* కరోనా వైరస్‌ వల్ల తల్లిదండ్రులు అనారోగ్యంపాలైతే.. అలాంటి వారికోసం తాత్కాలికంగా చైల్డ్‌ కేర్‌ కేంద్రాలను (CCIs)ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సంరక్షకులు లేని చిన్నారులకు అవసరమైన సహాయాన్ని అందించాలి.

* ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వారి చిన్నారుల బాధ్యతను చూసుకునే కుటుంబసభ్యుల నమ్మకస్తుల వివరాలను తీసుకోవాలి. ఇందుకోసం ఆసుపత్రిలో చేరిక సమయంలో నమోదు చేసుకునే వివరాలతోపాటు వీటిని కూడా ఆసుపత్రి సిబ్బంది నమోదుచేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది.

* కుంగుబాటులో ఉన్న చిన్నారులను పిల్లల సంరక్షణ సేవా పథకం కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న కేంద్రాలో తాత్కాలికంగా వసతి కల్పించేలా చర్యలు చేపట్టాలి.

* కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారులకు చైల్డ్‌ కేర్‌ కేంద్రాల్లోనే (CCIs) ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆయా కేంద్రాలను సందర్శించి, చిన్నారులతో సంభాషించే మానసిక నిపుణులు, కౌల్సిలర్ల జాబితాను సిద్ధం చేయాలి.

* కుంగుబాటులో ఉన్న చిన్నారులను మానసికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్థానికంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించాలని రాష్ట్రాలకు సూచించింది. వీటిలో మానసిక నిపుణులు అందుబాటులో ఉంచాలి.

* కొవిడ్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ముఖ్యంగా జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌-2015 ప్రకారం, అలాంటి చిన్నారులకు వసతి కల్పించేలా కలెక్టర్లు (డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌) కృషి చేయాలి.

* చిన్నారులను అవసరాలను పర్యవేక్షించడంతో పాటు వారికి అన్ని ప్రయోజనాలు అందేలా జిల్లా స్థాయిలో వివిధ విభాగాలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి.

* కొవిడ్‌తో ప్రభావితమైన కుటుంబాల్లో కుటుంబ ఆస్తులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులపై పిల్లలకు ఉన్న హక్కులను కాపాడే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అలాంటి ఆస్తులను అమ్మడం లేదా ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాలి. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలతో వీటిని పర్యవేక్షించాలి.

* అనాథలుగా మారిన చిన్నారులను చట్ట విరుద్ధంగా దత్తత తీసుకోవడం, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులపై ప్రత్యేక టీములతో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలి.

* దత్తత తీసుకుంటామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించే వారిని ట్రేస్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి.

* కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి వివరాలను పట్టణ స్థానిక సంస్థలు, పంచాయితీల స్థాయిలో ఏర్పాటైన బాలల సంక్షేమ కమిటీలు ఎప్పటికప్పుడు జిల్లా శిశు సంరక్షణ కేంద్రాలకు తెలియజేయాలి.

* ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పిల్లలకు ఉన్న సంక్షేమ పథకాలపై స్థానిక సంస్థలకు జిల్లా కలెక్టర్లు అవగాహన కల్పించాలి.

* కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలు లేదా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉచిత విద్య అందేలా చర్యలు చేపట్టాలి. ఒకవేళ పిల్లలు ప్రైవేటు స్కూల్‌లో చుదువుతుంటే విద్యాహక్కు చట్టం కింద వారి ఫీజుల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. అర్హత కలిగిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పథకాలు అమలు అయ్యేట్లు చూడాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags