Jeff Bezos To Fly to Space with Brother
Mark on July 20
అంతరిక్ష ప్రయాణానికి అమెజాన్
అధినేత జెఫ్ బెజోస్ - జులై 20న
ప్రయాణించనున్నట్లు వెల్లడి
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల అంతరిక్షంలోకి వెళుతున్న వ్యోమ నౌకలో తన సోదరుడితో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు వెల్లడించారు. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టే అంతరిక్ష సందర్శనలో భాగంగా జులై 20న తన ప్రయాణం ఉండనుందని తెలిపారు. సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రలో భాగంగా సందర్శకులను మోసుకెళ్తున్న తొలి వ్యోమనౌక కూడా ఇదే కావడం విశేషం. అంతరిక్ష సందర్శనలో భాగంగా ఈ రాకెట్ ఆరుగురు వ్యక్తులకు తీసుకువెళ్లనుంది. ఈ పర్యటన మొత్తం దాదాపు పది నిమిషాలు కొనసాగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అంతరిక్షానికి, భూ వాతావరణానికి మధ్య ‘కర్మన్ లైన్’గా వ్యవహరించే ప్రాంతంలో నాలుగు నిమిషాల పాటు యాత్రికులు గడిపిన అనంతరం తిరిగి భూమిని చేరుకుంటారు.
‘ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే అంతరిక్ష ప్రయాణం చేయాలనే కల ఉండేది. జులై 20వ తేదీన మా సోదరుడు మార్క్‌తో కలిసి ఆ కలను సాకారం చేసుకోబోతున్నాను. ఇది నా జీవితంలో చేయాలనుకున్న అతిపెద్ద విషయాల్లో ఒకటి. అందుకే అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రను నా సహోదరుడు మార్క్ బెజోస్‌తో కలిసి చేస్తుండడం గొప్పగా ఉంది’ అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు.
అంతరిక్ష పర్యటన కోసం బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూషెపర్డ్ రాకెట్‌పై 2012 నుంచి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. భూమి నుంచి 100కి.మీ కంటే ఎత్తులో ఉన్న సబ్ ఆర్బిటాల్‌లోకి వ్యోమగాములు, పేలోడ్‌లను తీసుకెళ్లేలా రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగాలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసినట్లు సదరు సంస్థ వెల్లడించింది. మార్గమధ్యంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పడు రాకెట్‌లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు తప్పించుకునే వ్యవస్థ (Escape System) క్రియాశీలకంగా పనిచేస్తుందని బ్లూ ఆరిజిన్ తెలిపింది.
ఇదిలాఉంటే, అంతరిక్ష
విమానం ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు పలు సంస్థలు ముమ్మర
ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వర్జిన్ గెలాక్టిక్, టెస్లాలు కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఏడాది
చివరినాటికి సాధారణ సందర్శకులతో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వర్జిన్ కూడా
ఏర్పాట్లు చేస్తోన్న విషయం తెలిసిందే.
Here’s a link to Jeff Bezos’s Instagram post regarding the announcement today that he and his brother Mark will join the auction winner on New Shepard’s first human flight on July 20th. https://t.co/2yfIEmTvv4
— Blue Origin (@blueorigin) June 7, 2021
0 Komentar