Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కరోనా టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి ఎందుకు వస్తుంది..?

 

కరోనా టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి ఎందుకు వస్తుంది..?

కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరిలో జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, అలసట, ఆయాసం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహ చాలా మందిని కలవరపెడుతోంది. అయితే, టీకా తర్వాత అలాంటి లక్షణాలు చాలా సాధారణమని, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజమవుతుందని చెప్పడానికి అవే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. 

టీకా తర్వాత శరీరంలో ఏం జరుగుతుందంటే..

రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి.. సహజ వ్యవస్థ. రెండోది.. సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య మొదలుపెడుతుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే.. తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.

మన రోగ నిరోధక వ్యవస్థలోని ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది. అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కన్పిస్తాయి.

అయితే టీకా రెండు డోసులు తీసుకున్నా కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉండకపోవచ్చు. అంతమాత్రనా వ్యాక్సిన్‌ పనిచేయట్లేదని కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక రెండో విషయం ఏంటంటే.. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోని భాగమే. అసలైన ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. ఈ వ్యవస్థ పునరుత్తేజమై శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి.

ఒక్కోసారి టీకా వల్ల శోషరస గ్రంథుల్లో వాపు కన్పిస్తుంది. అయితే ఇవి క్యాన్సర్‌ గడ్డలని భయపడుతుంటారు. అందుకే టీకా తీసుకునేందుకు మహిళలు మామోగ్రామ్స్‌ చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇక, చాలా తక్కువ మందిలో టీకా తీసుకున్న తర్వాతే అలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే, ఇది చాలా అరుదుగా జరగొచ్చని చెబుతున్నారు. కాగా.. టీకా వల్ల ఎలాంటి లక్షణాలు కల్పించినా అవి గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. కానీ, సుదీర్ఘంగా లక్షణాలు కన్పిస్తే మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏదేమైనా అపోహల వల్ల వ్యాక్సిన్‌కు దూరంగా ఉండొద్దు. ఈ లక్షణాల కంటే కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని మనమంతా గుర్తుంచుకోవాలి..!

Previous
Next Post »
0 Komentar

Google Tags