Telangana Witnesses Rare ‘22-degree Halo’
Around Sun
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం - సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు వలయం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి సహా పలు చోట్ల సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా ఓ వలయం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచి ఇలా కనిపిస్తోందని కొందరు స్థానికులు చెప్పారు. ఈ సుందర దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించుకున్నారు.
దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో
ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినపుడు ఇలాంటి దృశ్యం
ఆవిష్కృతమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంచు బిందువులపై పడిన
కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు.
Here you Go Video:- #Halo Sun over Hyderabad😍#Hyderabad @lovelyweather_ @CoreenaSuares2 @ynakg2 pic.twitter.com/rk7MDh8yfL
— Weather Lover (@Hyderabadrains) June 2, 2021
ఏమిటీ వలయం..?
సూర్యుడు చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయం కనిపించడం సాధరణ ప్రక్రియే. వాతావరణంలో ఉండే నీటిబిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి విక్షేపణం (Scattering) చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇదే మాదిరిగా ఒక్కోసారి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయాలు ఏర్పడుతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం నుంచి సూర్యున్ని వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్థం 22 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఈ వృత్తం ఏర్పడే ప్రక్రియను ‘22 డిగ్రీ వృత్తం’ అని పిలుస్తుంటారు. సముద్రమట్టానికి 20వేల అడుగుల ఎత్తులోనూ లక్షల కొద్ది అతి చిన్న మంచు స్ఫటికాల రూపంలో ఉండే తేలికగా మేఘాలు (సిర్రస్ క్లౌడ్స్) ఉంటాయనడానికి సంకేతంగా ఇలాంటి వృత్తాలు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
షట్కోణ ఆకారంలో ఉండే నీటి బిందువుల ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు అది వక్రీభవనం (కాంతి విభజన) తో పాటు పరావర్తనం చెంది మెరవడం వల్ల ఇలాంటి వృత్తాలు కనిపిస్తాయి. ఇంద్రధనస్సు ఏర్పడే మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ లేదా చంద్రుడి చుట్టూ ఏర్పడుతుంటాయి. స్థానిక వాతావరణ మార్పుల దృష్ట్యా ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయంలో ఇవి కనిపిస్తుంటాయి. సాధారణ సమయంలో మంచు పడుతున్న సమయంలోనూ ఇలాంటి వృత్తాలను మనం గమనిస్తూనే ఉంటాం’ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. చంద్రుడి చుట్టూ కనిపించే ఇలా వృత్తాలను ‘మూన్ రింగ్’గా వ్యవహరిస్తారు. అయితే, ఇంద్రధనస్సులతో పోలిస్తే ఇవి ఎక్కువ రోజులు ఆకాశంలో కనిపిస్తూ కళ్లను కనువిందు చేస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
0 Komentar