TS: 4, 9 తరగతుల్లో ‘తెలుగు’ తప్పనిసరి
– ఎస్‌సిఈఆర్‌టి ఆదేశాలు జారీ
ఇతర బోర్డులు అమలు చేసేలా చర్యలు తీసుకోండి
రాష్ట్రంలో 2018లో వచ్చిన చట్టం ప్రకారం సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, ఐబీ తదితర బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో కూడా పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయడం తప్పనిసరని, ఆ ప్రకారం 2021-22. విద్యా సంవత్సరంలో 4, 9 తరగతుల్లో అమలు చేయాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) స్పష్టం చేసింది.
ఈ మేరకు అన్ని పాఠశాలలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈఓలు, ఆర్జేడీలకు ఎస్ సీఈఆర్టీ సంచాలకురాలు రాధారెడ్డి ఇటీవల ఆదేశాలు జారీచేశారు. చట్టం అమల్లో భాగంగా 2018-19 విద్యాసంవత్సరం నుంచి దశల వారీగా తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు. 2018-19లో ఒకటి, ఆరు తరగతులు, 2019-20లో రెండు, ఏడు, 2020 -2021లో మూడు, ఎనిమిది, 2021-22లో నాలుగు, తొమ్మిది, 2022-23లో అయిదు, పది తరగతుల్లో అమలు చేయాలన్నది ప్రణాళిక.
ఆ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో నాలుగు,
తొమ్మిది తరగతుల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడం తప్పనిసరి.
ఇతర బోర్డులు త్రిభాషా సూత్రం ప్రకారం 8 వరకు మూడు భాషా
సబ్జెక్టులను బోధిస్తున్నా 9వ తరగతి నుంచి ద్విభాషా
సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. ఆంగ్లంతో పాటు హిందీ లేదా ఇతర భాషలను
బోధిస్తున్నాయి. తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయడం లేదు. దీన్ని గుర్తించి అమలు
చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని రాధారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే
ఎస్సీఈఆర్టీ 1, 2, 3, 6, 7, 8 తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలను
తయారుచేసి వెబ్ సైట్లో ఉంచిందని, నాలుగు, తొమ్మిది తరగతుల పుస్తకాలను ముద్రణ తర్వాత వెబ్ సైట్లో ఉంచుతామని
తెలిపారు.
0 Komentar