5 Changes Coming into Effect from August
1, Will Impact Salary, EMI Payments
ఆగస్టు 1వ తేదీ నుంచి మారే ముఖ్యమైన
విషయాలు ఇవే
ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ఇవన్నీ ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. మరి రేపటి నుంచి జరగబోయే మార్పులేంటో.. ఓసారి చూద్దాం..!
1. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు పెంపు..
ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్‌ఛేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది.
2. ఐసీఐసీఐ ఖాతాదారులకు గమనిక..
ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలూ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.
3. సెలవు రోజునా.. వేతనం క్రెడిట్..
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్‌బీఐ ఇటీవల వెల్లడించింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. అంతేగాక, బ్యాంకు నుంచి నేరుగా వెళ్లే రుణ వాయిదాలు(ఈఎంఐలు) సాధారణంగా సెలవు రోజుల్లో బ్యాంకు నుంచి డెబిట్ కావు. అయితే ఆదివారం నుంచి ఇది మారుతుంది. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజునాడూ బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.
4. ఐపీపీబీ డోర్‌స్టెప్ సేవల
ఛార్జీలు..
ఆగస్టు ఒకటో తేదీ నుంచి డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇంటివద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు రూ. 20 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే డోర్‌స్టెప్ సేవల్లో ఐపీపీబీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లినప్పుడు లావాదేవీలపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని వెల్లడించింది.
5. గ్యాస్ ధరలు కూడా..
సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు
సంస్థలు వంట గ్యాస్ ధరలు పెంచుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ
ధరలను సవరిస్తుంటారు. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆగస్టు 1న
గ్యాస్ ధరలను కూడా పెంచే అవకాశముంది.
0 Komentar