Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆషాఢ మాసం: ఈ మాసంలో ఏం చేయాలి?, మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?, పెళ్లిళ్లు ఎందుకు చేయరు?

 

ఆషాఢ మాసం: ఈ మాసంలో ఏం చేయాలి?, మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?, పెళ్లిళ్లు ఎందుకు చేయరు?

======================

ఆషాఢ మాసం పర్వదినాలను తీసుకొస్తుంది. చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంనందు ఉండటం వల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు.  2024 లో జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసం ఉంటుంది. విష్ణు సంబంధంతో కూడి ఉన్న ఈ మాసానికి మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయడం విశేషం. సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధనుస్సు రాశి అంత్యం వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంది. ఆషాఢ శుక్ల విదియ నాడు పూరీ జగన్నాథుడి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజున సుభద్ర బలభద్రుడితో కూడిన జగన్నాథుడిని రథంపై ఊరేగిస్తారు. తెలంగాణలో బోనాలు కూడా ఈ మాసంలోనే జరగడం మరో విశేషం. 

ఈ మాసంలో ఏం చేయాలి?

ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఈ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పాటిస్తారు. చాతుర్మాస దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శ్రీ మహా విష్ణువు ఆషాఢ మాసంలో శయనిస్తాడు. ఆషాఢం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహా విష్ణువు శయనంతో ఈ నాలుగు మాసాల్లో తేజం తగ్గడం వల్ల దీనికి శూన్య మాసం అని పేరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శూన్య మాసాల్లో శుభకార్యాలు (వివాహం, ఉపనయనం, గృహారంభ ప్రవేశాలు వంటివి) చేయరు.

* ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద వ్రతం అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించి ఆలయాలను దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన వల్ల వంశాభివృద్ధి జరిగి కుజదోషం, కాలసర్పదోషం తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ సప్తమిని భాను సప్తమి అని కూడా అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తారు.

* ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ పౌర్ణమి రోజున వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు, మహాభారత, భాగవతాలు వంటివి లోకానికి అందజేసిన జగద్గురు అయిన వేద వ్యాసుల వారి జన్మదినం కావడంతో ఈ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ అని పేరు. ఆ రోజు వ్యాస భగవానుడిని పూజించి వారివారి గురు పరంపరను అనుసరించి గురు పూజ నిర్వర్తిస్తారు.

* ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ (దీపాన్ని వెలిగించి పూజచేయడం) చేస్తారు. అమావాస్య రోజున దీపపు కుందెలు శుభ్రం చేసి ముగ్గుపై దీపాన్ని నిలబెట్టి పసుపు, కుంకుమతో పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి నలువైపులా దీపాలు పెట్టడం వల్ల లక్ష్మీప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి.

మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

ఆషాఢ మాసం రాగానే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగు నాట ఆచారం. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గౌరి ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి. ఆషాఢ మాసంలో అధిక వర్షాలు, నీటిలో మార్పులు రావడం సంభవిస్తాయి. రోగాలు, క్రిములు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారినపడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తోంది. గోరింటాకును మహిళలు పెట్టుకోవడం వల్ల గర్భాశయానికి సంబంధించిన దోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి. 

పెళ్లిళ్లు ఎందుకు చేయరు?

ఆషాఢంలో సప్త ధాతువులు సరిగా పనిచేయకపోవడం, వర్షాలు కురవడంతో పొలం పనులు అధికంగా ఉండటం, ప్రత్యేకించి శూన్య మాసం కావడంతో పాటు దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ఆషాఢంలో గర్భధారణకు అనుకూలమైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ మాసంలో పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్తగా పెళ్లైన వారిని కూడా దూరంగా ఉంచుతారు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags