Basavaraj Bommai will be the new Chief
Minister of Karnataka
కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్
బొమ్మై
కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో
కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని
భాజపా ఖరారు చేసింది. రాష్ట్ర ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్ సామాజిక
వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ నిర్ణయంతీసుకుంది. బసవరాజ్ బొమ్మై
ఎంపికపై భాజపాలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర
ప్రధాన్ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై.. మాజీ సీఎం ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు. యడియూరప్పకు కూడా అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. మరోవైపు, భాజపా శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. ఈ సమావేశానికి భాజపా అధిష్ఠానం పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న యడియూరప్ప హాజరయ్యారు. బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌కు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు, కొత్త సీఎం రేసులో రాష్ట్ర గనుల శాఖమంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాట్, బసవరాజు బొమ్మై, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, ప్రభుత్వ చీఫ్‌విప్ సునీల్ కుమార్ పేర్లు కూడా ప్రధానంగా వినబడిన విషయం తెలిసిందే.
యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి
రాజీనామా చేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం ప్రకటించినప్పట్నుంచి ఆయన వారసుడు ఎవరు? అనే
అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. యడ్డీ తన రాజీనామా లేఖను గవర్నర్ థావర్‌చంద్
గహ్లోత్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లింగాయత్ వర్గంలో బలమైన
నేతగా ఉన్న యడియూరప్ప స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు.
0 Komentar