China Hackers Target SBI Customers with
Fake KYC Link, Free Gift Scams
చైనా హ్యాకర్లు: ఉచితంగా బహుమతులంటూ
కొత్త ఎత్తుగడ – ఎస్‌బిఐ ఖాతాదారులపై గురి
దేశ రక్షణ శాఖ వెబ్‌సైట్లు... ప్రభుత్వ.. కార్పొరేటు సంస్థల వెబ్‌సైట్లపై దాడులు చేస్తూ వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా హ్యాకర్లు కొత్త పద్ధతిలో వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు పథకం వేశారు. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారుల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్ తెలుసుకొని వాట్సాప్, మెయిల్స్ ద్వారా కేవైసీ అప్‌డేట్ పేరుతో లింకులు పంపుతున్నారు. అందులో వివరాలను నింపితే చాలు... ఉచితంగా రూ.50 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చంటూ సందేశాలు పంపుతున్నారు.
కొద్దిరోజులుగా దిల్లీ, హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లోని స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు ఇలాంటి సందేశాలు వస్తుండడంతో దిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోసెక్ కంపెనీతో కలిసి పరిశోధించగా.. ఇదంతా చైనా హ్యాకర్ల పనేనని సాక్ష్యాధారాలు లభించాయి. ఈ సమాచారాన్ని సైబర్‌పీస్ ఫౌండేషన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ప్రజలు, ఖాతాదారులు మోసపోవద్దంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ వేదికగా విజ్ఞప్తిచేసింది.
అచ్చూ అసలైన బ్యాంక్‌లాగే...
వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న చైనా హ్యాకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేజీని అచ్చుగుద్దినట్లు దించేశారు. ఈ పేజీకి సంబంధించిన వివరాలను పరిశోధించగా.. చైనా హ్యాకర్లు వేరే డొమైన్‌ను ఉపయోగిస్తున్నారని తేలింది.
* మీరు స్టేట్‌బ్యాంక్ ఖాతాదారులా... మీ వివరాలను అప్‌డేట్ చేయండి... లేదంటే మీ ఆన్‌లైన్ ఖాతా లావాదేవీలు స్తంభించిపోతాయంటూ సంక్షిప్త సందేశాలు, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ పంపుతున్నారు.
* ఆ సందేశాల్లో ఉన్న లింక్‌ను క్లిక్ చేయగానే కేవైసీ వెరిఫికేషన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేజీ మన చరవాణి లేదా మెయిల్‌లో ప్రత్యక్షమవుతుంది.
* అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో, అభినందనల సందేశం, రూ.50 లక్షల బహుమతి గెలుచుకోవాలంటే సర్వేలో పాల్గొనండి అని ఉంటుంది.
* ఆ పేజీ చివరలో మేం సర్వేలో పాల్గొన్నాం.. బహుమతులు గెలుచుకున్నామంటూ నకిలీ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన అభిప్రాయాలుంటున్నాయి.
* ‘అనంతరం కంటిన్యూ లాగిన్’ పేరుతో వ్యక్తిగత వివరాలన్నీ అడుగుతుంది. అనంతరం యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కూడా పూర్తి చేయమంటుంది.
* పాస్‌వర్డ్ పూర్తి చేసిన వెంటనే ఓటీపీ పంపుతుంది. ఓటీపీ నమోదు చేయగానే... మరో పేజీ వస్తుంది ఇందులో నెట్ బ్యాంకింగ్ వివరాల కోసం పేరు, చరవాణి నంబర్, పుట్టిన తేదీ అడుగుతోంది. ఒక్కసారిగా వివరాలు నింపగానే.. ఉన్నట్లుండి ఆ డిజిటల్ పేజీ మాయమవుతుంది.
ఖాతాదారులూ జాగ్రత్త...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తున్న ఈ ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవైసీ వివరాలు నమోదు చేయాలంటూ వస్తున్న లింకులను క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు. నిజమైన వెబ్‌సైట్ మాదిరిగా చైనాహ్యాకర్లు లింకులు పంపుతున్నారని ఈ డొమైన్ చిరునామాలన్నీ చైనాలో ఉన్నాయన్నారు. హ్యాకర్లు పంపిన లింకులను పొరపాటున క్లిక్ చేస్తే.. బ్యాంక్ ఖాతాలో నగదుతో పాటు వ్యక్తిగత రహస్యాలన్నీ సైబర్‌నేరస్థుల గుప్పిట్లోకి వెళ్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
0 Komentar