Hackers Target SBI Customers with Fake KYC
Link, Free Gift Scams
KYC అప్‌డేట్ లింక్
వచ్చిందా, క్లిక్ చేస్తే డబ్బు మొత్తం మాయం - ఎస్‌బీఐ
ఖాతాదారులను టార్గెట్ చేసిన హ్యాకర్లు
ఎస్‌బీఐ లో మీకు ఖాతా ఉందా..? వాట్సాప్‌లో కేవైసీ(నో యువర్ కస్టమర్) అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చిందా..? అయితే జాగ్రత్త..!! ఆ మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్ చేస్తే మీ ఖాతాలోని డబ్బు మొత్తం మాయమవడం ఖాయం. అవును.. ఎస్‌బీఐ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు చైనా హ్యాకర్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్‌డేట్, ఉచిత గిఫ్ట్‌లంటూ నకిలీ లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తున్నారట. ఈ మేరకు దిల్లీకి చెందిన సైబర్‌పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోసెక్ అనే సంస్థలు ఇటీవల జరుగుతున్న ఈ సైబర్ నేరాలను బయటపెట్టి ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.
ఈ సంస్థలు చెప్పిన దాని ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ముందు మన ఫోన్‌కు కేవైసీ వెరిఫికేషన్ అంటూ ఓ మెసెజ్ పంపిస్తారు. అందులోని లింక్ క్లిక్ చేయగానే అచ్చంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ పేజ్‌లాగే ఉండే పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ పేరు, మొబైల్ నంబరు, పుట్టినతేదీ వంటి వివరాలు ఇవ్వమని అడుగుతుంది. అవి నింపగానే మళ్లీ ఓటీపీ వచ్చిన పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ‘లాగిన్’ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్ నొక్కగానే కేవైసీ పేజీ ఓపెన్ అయ్యి మన బ్యాంకు ఖాతా యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ అడుగుతుంది. ఈ పేజీలన్నీ అచ్చంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ పేజీల్లాగే కన్పిస్తాయి.
కేవైసీ అప్‌డేట్‌తో పాటు హ్యాకర్లు మరో నకిలీ లింక్‌లను కూడా ఎస్‌బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఎస్‌బీఐ ఫొటోతో ఓ కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత సర్వేలో పాల్గొంటే రూ. 50లక్షల బహుమతులు గెలుచుకోవచ్చనే సందేశం కన్పిస్తుంది. ఆ సర్వే కోసం క్లిక్ చేస్తే మన వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. ఇలా నకిలీ లింక్‌లతో హ్యాకర్లు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము కాజేస్తున్నారని సైబర్ నిపుణులు వెల్లడించారు. ఇలాంటి లింక్‌లు పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎస్‌ఐబీతో పాటు కొటక్ మహీంద్రా బ్యాంక్, పీఎన్‌బీ ఖాతాదారులకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిసింది. ఈ హ్యాకర్లు చైనా నుంచి పనిచేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు కేవైసీ మోసాలపై ఇటీవల ఎస్‌బీఐ
కూడా ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కొందరు మోసగాళ్లు బ్యాంకు/ సంస్థ ప్రతినిధిగా
మేసేజ్ పంపి వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్‌బీఐ
తన ట్విటర్‌లో పేర్కొంది. కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించదన్న
విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.
0 Komentar