టిఎస్: 12,943
టీచర్ పోస్టులు ఖాళీ - ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించండి
9,221 మంది అధికంగా ఉన్నారు - రాష్ట్రానికి
సూచించిన కేంద్ర విద్యాశాఖ
పాఠశాల విద్య కోసం రూ.1,467
కోట్లకు ఆమోదం
‘‘ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1-8 తరగతుల్లో పిల్లలు తక్కువగా... ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి(పీటీఆర్)ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద 9,221 మంది టీచర్లు అధికంగా పనిచేస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ పరిస్థితి పెరుగుతోంది. అందుకే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేయడం అవసరం’’ అని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే అందులో 20 జిల్లాల్లో విద్యార్థులు 9, 10 తరగతుల్లోనే చదువు మానేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చింది.
సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశం మేలో
జరగగా దానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర విద్యాశాఖ తాజాగా రాష్ట్రానికి
పంపింది. అందులో తెలంగాణలోని పరిస్థితిని తెలుపుతూ పలు లోపాలను ప్రస్తావించింది.
పదో తరగతి పూర్తయిన వారిలో 12 జిల్లాల్లో 65 శాతం లోపే ఇంటర్‌లోకి ప్రవేశిస్తున్నారని
తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 42.35 శాతం, జోగులాంబ
52.85, సంగారెడ్డి 53.29, మహబూబాబాద్
56.06, మేడ్చల్ 56.57, వరంగల్
గ్రామీణ జిల్లాలో 59.10 శాతం విద్యార్థులు మాత్రమే ఇంటర్, ఆపై
చదువులోకి వెళుతున్నారని తెలిపింది. మాధ్యమిక స్థాయిలో(9, 10
తరగతులు) 291 ఉపాధ్యాయ, 1,995 ప్రధానోపాధ్యాయ ఖాళీలున్నాయని,
వాటిని ప్రాధాన్యంగా తీసుకొని భర్తీ చేయాలని సూచించింది.
ఇతర ఖాళీలు ఇలా...
‘‘ఎస్‌సీఈఆర్‌టీలో 45 మందికిగాను
10 మందే పనిచేస్తున్నారు. అంటే 78 శాతం పోస్టులు ఖాళీ. వాటిని ప్రాధాన్యంగా
తీసుకొని భర్తీ చేయకుంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) స్కోర్‌పై
ప్రభావం పడుతుంది. ఇక 10 డైట్లలో కూడా 91 శాతం ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 1-8
తరగతుల కోసం 1,07,821 ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయగా అందులో 10,657; 9,
10 తరగతులకు 26,521 పోస్టులకు ఇంకా 2,286- మొత్తం 12,943 ఉపాధ్యాయ
పోస్టులు ఖాళీలున్నాయి’’ అని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. అయితే విద్యార్థులు,
ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే 9,221 మంది
ఉపాధ్యాయులు అవసరానికి మించి పనిచేస్తుండగా మంజూరు చేసిన పోస్టుల్లో మాత్రం ఖాళీలు
ఉండటం గమనార్హం. దీనిప్రకారం ప్రభుత్వం మంజూరు పోస్టులను తగ్గించుకోవడమో లేదా
పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణో చేయాల్సి ఉంటుంది.
పనులన్నీ పెండింగ్
‘‘గత ఏడాది వరకు 952 పనులు
పెండింగ్‌లో ఉండగా వాటిల్లో 107 మాత్రమే పూర్తయ్యాయి. 2020-21 సంవత్సరానికి 19
అదనపు తరగతులను మంజూరు చేస్తే ఏ ఒక్కటీ మొదలుకాలేదు. 93 సైన్స్ ల్యాబ్‌లకు ఒక్క
చోట కూడా పనులు ప్రారంభం కాలేదు’’ అని మినిట్స్‌లో పేర్కొంది. వాటినన్నిటిని వచ్చే
డిసెంబరు వరకు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపింది.
మరికొన్ని అంశాలు...
* రాష్ట్రానికి పాఠశాల విద్య కోసం
మొత్తం రూ.1,467 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో కేంద్రం వాటా 60 శాతం
కింద రూ.880.61 కోట్లు విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర వాటా 40 శాతం కింద
రూ.587.07 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
* 3,010 ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్
తరగతి గదులుగా తీర్చిదిద్దుతారు.
* జాయ్‌ఫుల్ లెర్నింగ్ అమలు కోసం
రూ.64.89 లక్షలు కేటాయించారు.
* నాణ్యమైన విద్య అందించేందుకు
3,634 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్ క్లస్టర్ పాఠశాలలుగా
మారుస్తారు. అందుకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.109 కోట్లు కేటాయించారు.
* అన్ని పాఠశాలల్లో గ్రీన్ చాక్
బోర్డుల ఏర్పాటుకు రూ.34.45 కోట్లు ఖర్చు చేయనున్నారు.
* విద్యార్థుల్లో అభ్యసన
సామర్థ్యాలను పెంచేందుకు ఎస్‌సీఈఆర్‌టీలో అసెస్‌మెంట్ సెల్ ఏర్పాటుకు రూ.35
లక్షలు కేటాయించారు. దీనిద్వారా సర్వేలు నిర్వహించడం, పరీక్షలు
చేపట్టడంలాంటి పలు కార్యక్రమాలు చేస్తారు.
0 Komentar