US Reports Monkeypox Case - First Time After
20 years
అమెరికాలో వెలుగులోకి అరుదైన మంకీపాక్స్
వ్యాధి
- దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలి కేసు
అమెరికాలో దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇటీవల నైజీరియా వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి ‘మంకీపాక్స్’(Monkeypox) సోకిందని ‘వ్యాధి నియంత్రణా, నివారణ కేంద్రం(సీడీసీ)’ తెలిపింది. ప్రస్తుతం సదరు వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తి ప్రయాణించిన విమానంలో ఇతర ప్రయాణికుల్ని గుర్తించి వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క కేసే వెలుగులోకి వచ్చిందని.. దీని వల్ల సామాన్య ప్రజానీకానికి పెద్ద ప్రమాదమేమీ లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. చివరిసారి 2003లో 47 మందికి మంకీపాక్స్ వచ్చినట్లు వెల్లడించారు. గత నెల జూన్‌లో బ్రిటన్‌లోనూ నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
మంకీపాక్స్ అంటే?
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఇది కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా సోకుంది. వ్యాధి సోకిన వారిని తాకినా.. మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.
లక్షణాలు ఏంటి?
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట మంకీపాక్స్ లక్షణాలు. తర్వాతి దశలో చర్మం పైన దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా ముఖం, అర చేతులు, అరికాళ్లపై వస్తుంటాయి. దీని ద్వారా విపరీతమైన దురద లేదా నొప్పి కలుగుతాయి. ఒక్కోసారి మచ్చలు కూడా ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి.
చికిత్స ఉందా?
ప్రస్తుతం మంకీపాక్స్‌ను పూర్తిగా నయం చేసే సురక్షితమైన చికిత్స ఏదీ లేదని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో స్మాల్పాక్స్ వ్యాక్సిన్ సహా కొన్ని యాంటీవైరల్ ఔషధాలు ఫలితాలిచ్చినట్లు పేర్కొంది.
0 Komentar