What is Lightning, how it Happens - Lightning
Safety Tips
పిడుగులు పడితే రక్షించుకోవడం ఎలా?
ఏం చేయాలి? చేయకూడనివి ఏమిటి? ఈ పిడుగులేమిటి? వాటి కథేమిటి?
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతూంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తూంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతూంటుంది.
ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు (ఎలక్ట్రాన్లు) భూమివైపు ప్రయాణిస్తాయి. (ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్తు అంటాం) మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణా (విద్యుత్తు స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి)ల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతూంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటివరకూ మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగుపాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. ఇంతలోపే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది.
నేలపైకి దూసుకొచ్చేవే ఎక్కువ
నేలపై, నదులు, సముద్రాలపై కూడా పిడుగులు పడవచ్చు కానీ.. సాధారణంగా భూమ్మీదకు చేరేవే ఎక్కువ. సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ అరవై లక్షల పిడుగుపాట్లు నమోదవుతూంటాయని అంచనా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక్క 2019లోనే దాదాపు 2,900 మంది పిడుగుపాటుకు మరణించారు.
ముందుగా గుర్తించలేమా?
పిడుగులను ముందుగా గుర్తించేందుకు ఇప్పటికే ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. వజ్రపథ్ పేరుతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను వాడితే మన పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే తెలిపి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో కనీసం నలభై నిమిషాల ముందే తెలుసుకోవచ్చు.
జాగ్రత్తలు
► బహిరంగ
ప్రదేశంలో ఉంటే నిటారుగా నిలుచొని ఉండటం కూడదు
► చెట్లు,
చెమ్మ, నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
► గుంపులుగా
ఉండటం కంటే.. విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది.
► ప్రతి
మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో
చోటుకు వెళ్లకండి.
► పొడవాటి
చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో నుంచోరాదు.
► స్మార్ట్‌ఫోన్
వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు.
► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే.
మీకు తెలుసా?
► ఒక్కో
మెరుపులో ఉండే విద్యుత్తు.. దాదాపు పది కోట్ల వోల్టులు!
► లేక్
మారాసియాబో: ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం.
వెనిజులాలో ఉంది ఇది. ఇక్కడ ఏటా 160 రోజులపాటు తుపాను గాలులు
వీస్తూంటాయి. ఆయా రోజుల్లో సగటున నిమిషానికి 28 మెరుపులు..
వరుసగా 10 గంటలపాటు కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకే రాత్రి దాదాపు 36 వేల మెరుపులు,
వాటితో పిడుగులూ పడినట్లు వార్తలు ఉన్నాయి.
► మెరుపును
కృత్రిమ పద్ధతుల్లో తొలిసారి సృష్టించింది.. నికోలా టెస్లా. ఈ కృత్రిమ మెరుపు
తరువాత పుట్టిన ఉరుము శబ్ధం 15 మైళ్ల దూరం వరకూ
వినిపించిందట.
► మెరుపు
లేదా పిడుగు కారణంగా గాల్లో ని నైట్రోజన్.. మొక్కలు శోషించేందుకు అనువైన రూపంలోకి
మారిపోతుంది.
0 Komentar