Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

e-RUPI: PM Narendra Modi Launches e-RUPI Digital Payment Solution

 

e-RUPI: PM Narendra Modi Launches e-RUPI Digital Payment Solution

e-RUPI: డిజిటల్‌ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ ‘ఇ-రూపీ’ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇ-రూపీ’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇ-రూపీ కీలక పాత్ర పోషించనుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. లబ్ధిదారులకు పారదర్శకంగా నగదు చేరేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. 

ఇ-రూపీ వ్యవస్థలో ఒక క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తారు. వీటినే ఇ-రూపీగా భావించొచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ లేని వారు వోచర్‌ కోడ్‌ చెప్పినా సరిపోతుంది. 

ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్‌, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం ఇకపై లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే బదులు నేరుగా వారి మొబైల్‌ నంబర్‌కే ఈ కూపన్‌ను పంపిస్తారు. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

గూగుల్‌ పే, యూపీఐ, ఫోన్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల లాగానే ఇ-రూపీ ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫాం కాదు. ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం 11 బ్యాంకులు ఇ-రూపీ సేవలను అందిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ కూపన్లు జారీ చేయడంతో పాటు, రీడీమ్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. కెనరా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ కేవలం ఇ-రూపీ కూపన్లను జారీ చేస్తున్నాయి. రీడీమ్‌ చేసుకునే సదుపాయం లేదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags