RBI May Come Out with Model on India’s
Digital Currency by Year-End
ఆర్‌బీఐ: డిసెంబరు
నాటికి డిజిటల్ కరెన్సీ నమూనా - కీలక రేట్లు యథాతథం
ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు
డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చే విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరో అడుగు వేసింది. డిజిటల్ కరెన్సీ కార్యకలాపాల నమూనాను ఈ ఏడాది చివరకు వెల్లడించగలమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ తెలిపారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా శుక్రవారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం కోసం కీలక రేట్లను యథాతథంగా రికార్డు కనిష్ఠాల్లోనే ఉంచాలని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. కరోనా పరిణామాల ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పటిదాకా ఆర్‌బీఐ 100కు పైగా చర్యలను తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొంది. ఎంపీసీ నిర్ణయాలు ఇలా..
4 శాతం వద్దే రెపో రేటు: బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తెచ్చుకునే నిధులకు చెల్లించే కీలక రుణ రేటు (రెపో రేటు) ను ఆర్‌బీఐ 4 శాతం వద్దే కొనసాగించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని 4-1 మెజారిటీతో ఎమ్‌పీసీ నిర్ణయించింది. రేట్ల పెంపు ఉండదనడానికి ఇది సూచిక. ఆర్‌బీఐ చివరిసారిగా 2020 మే 22న రేట్లలో కోత విధించింది. జీడీపీ అంచనాలు: కరోనా కారణంగా 2020-21లో 7.3 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పుంజుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను 9.5 శాతం వద్దే కొనసాగించింది. వచ్చే కొద్ది త్రైమాసికాలకు వృద్ధి అంచనాలను తగ్గించిన ఆర్‌బీఐ, వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో జీడీపీ అంచనాలను 17.2 శాతం నుంచి 21.4 శాతానికి పెంచింది.
ధరలు మరింత పెరుగుతాయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను 5.1% నుంచి 5.7 శాతానికి చేర్చింది. జులై-సెప్టెంబరులో 5.9%; అక్టోబరు-డిసెంబరులో 5.3%, జనవరి-మార్చిలో 5.8 శాతానికి ద్రవ్యోల్బణం చేరొచ్చన్నది అంచనా. 2022-23 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరొచ్చని పేర్కొంది.
రుణ రేట్ల బదిలీలో వేగం: 2019 ఫిబ్రవరి నుంచి కీలక రేట్లలో కోత విధిస్తుండగా, కరోనా
నేపథ్యంలో అది మరింత పెరిగింది. కొత్త రుణాలకు 217 బేసిస్
పాయింట్ల మేర; అంతక్రితం తీసుకున్న రుణాలకు 170 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గింది. కీలక రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని
బ్యాంకులు వినియోగదార్లకు బదిలీ చేస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని ఆర్‌బీఐ
గవర్నర్ పేర్కొన్నారు.
0 Komentar