Some Of the Most Viral Photos on This World Photography Day
World Photography Day 2021: చిత్రాలు. వర్ణించలేని ఎన్నో మాటలకు అర్థాలు
ఈ సందర్భంగా వైరల్ అయిన చిత్రాలు ఇవే
.
మాటల్లో చెప్పలేని ఎన్నో ఉద్వేగాల్ని ఒక్క చిత్రంతో వర్ణించవచ్చు.. ఇది మన పెద్దలు చెప్పిన మాట. దానికి తగ్గట్టే సందర్భాన్ని బట్టి ఎన్నో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల హల్‌చల్, మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు, ఇటీవల ఆకట్టుకున్న ఒలింపిక్స్ ఇలా ప్రతి విషయంలోనూ.. పలు చిత్రాలు ప్రజల మనసుల్ని తాకాయి.. బాధించాయి..ఆశ్చర్యపర్చాయి. ఈ రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా ఆ చిత్రాలెంటో మనమూ చూద్దామా..!
1. కావాలంటే నన్ను చంపేయండి..!
ఈ ఏడాది ప్రారంభంలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ చర్యకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు నినదించారు. కానీ, ఆ తీరు అక్కడి సైన్యానికి మాత్రం నచ్చలేదు. ఆందోళనకారుల్ని అరెస్టు చేయడం, అయినా మాట వినకపోతే తూటాకు పనిచెప్పడం వంటి చర్యలకు పూనుకుంది. ఈ పరిస్థితులతో ఆవేదనకు గురైన ఒక సన్యాసిని తన ప్రాణాలు తీసుకోండంటూ ముందుకొచ్చింది. మోకాళ్లపై కూలబడి ‘వారిని ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అని వేడుకుంది.
2. బంగారు పతకం గెలిచి.. అల్లికతో
ఫేమస్..
కొవిడ్ నేపథ్యంలో జరిగిన ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించి జపాన్ ప్రశంసలు అందుకుంది. క్రీడాటోర్నీ సాంతం విజయ దరహాసాలు, ఎన్నెన్నో ఉద్వేగాలతో నిండిపోయింది. అదే సమయంలో బ్రిటన్‌కు చెందిన ఓ డైవర్ గ్యాలరీలో కూర్చొని కుట్లు అల్లికలతో తన ఉద్వేగాల్ని అదుపులో పెట్టుకున్నారు. ఈ 27 ఏళ్ల టామ్ డాలే అప్పటికే డైవింగ్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గగా.. ఈ చిత్రంతో మాత్రం ప్రపంచాన్ని ఆకర్షించారు. మరోవిషయం ఏంటంటే.. ఆయన ఎల్‌జీబీటీక్యూ ఐకాన్ కూడా..
3. ఒక్క ఫొటో..2
కోట్ల లైక్‌లు..
రొనాల్డో, మెస్సి.. ప్రస్తుత తరం ఫుట్‌బాల్ ఆటగాళ్లలో దిగ్గజాలు. ఈ ఇద్దరిలో ఎవరు ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రొనాల్డో నెలకొల్పిన ఓ రికార్డును మెస్సి బద్దలుకొట్టాడు. అయితే అది మైదానంలో కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇటీవల కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనాను విజేతగా నిలిపిన మెస్సి.. ఆ ట్రోఫీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫొటోకు 2 కోట్లకు (20 మిలియన్లకు) పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అథ్లెట్ పోస్టు చేసిన ఫొటోకు అత్యధిక లైకుల రికార్డు మెస్సి సొంతమైంది. గతంలో డీగో మారడోనా కన్నుమూయగా నివాళిగా ఆయనతో దిగిన ఫొటోను రొనాల్డో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకూ దానికి కోటి 98 లక్షలకు (19.8 మిలియన్లు) పైగా లైక్‌లు వచ్చాయి. ఇప్పుడా రికార్డును మెస్సి ఫొటో వెనక్కినెట్టింది.
4. మనసంతా ఆందోళన.. తర్వాత అంకమేంటో
తెలియని పయనం..
ఈ ఫొటోలో కన్పిస్తున్నది ప్యాసింజర్ రైల్లోని జనరల్ బోగీ కాదు.. అఫ్గాన్ పౌరులతో నిండిపోయిన అమెరికా విమానం ఇది..! తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఇందుకోసం ప్రాణాలను తెగించేందుకైనా వెనుకాడటం లేదు. కాబూల్ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో కన్పించిన ఈ దృశ్యం.. అఫ్గాన్ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా 640 మంది విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు.
5. కొవిడ్ ఉద్ధృతి.. పగవాడికి కూడా
రావొద్దనుకున్న దుస్థితి..
కొవిడ్ రెండో దఫా ఉద్ధృతి భారత్‌ను
తీవ్రంగా వణికించింది. ఆసుపత్రులు, మార్చురీలు, శ్మశానవాటికలు నిండిపోయిన దృశ్యాలు కలవరపెట్టాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు
గంటల తరబడి వేచిచూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఆ తాలూకు దృశ్యమే ఇది.
0 Komentar