Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mid-Day Meal Scheme Renamed As ‘Pradhan Mantri Poshan Shakti Nirman’

 

Mid-Day Meal Scheme Renamed As ‘Pradhan Mantri Poshan Shakti Nirman’

మధ్యాహ్న భోజనం మరో 5 ఏళ్లు - మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ స్కీమ్‌(పీఎం పోషణ్‌)గా కొనసాగింపు

మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల్లో మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రం ఆహార ధాన్యాలపై అదనంగా రూ.45వేల కోట్లు వెచ్చించనుంది. దీంతో అయిదేళ్ల కాలానికి ఈ పథకంపై ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చు రూ.1,30,794.90 కోట్లకు చేరనుంది.

ఈ పథకం కింద అయిదేళ్ల పాటు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు తాజాగా వండిన వేడివేడి భోజనం అందిస్తారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదివే 11.80 కోట్ల మంది పిల్లలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ స్కీమ్‌(పీఎం పోషణ్‌)గా కొనసాగనుంది. 

* ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే పూర్వ ప్రాథమిక, బాలవాటికల్లో చదివే పిల్లలకూ దీన్ని వర్తింపజేస్తారు. ‘తిథి భోజనం’ పేరుతో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో పిల్లలకు ప్రత్యేక భోజనం అందించేలా చూస్తారు.

* పాఠశాలల్లో పోషకాహార పంట తోటలను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు తోటల పెంపకంతో పాటు, ప్రకృతితో మమేకమయ్యే విధానాన్ని ప్రోత్సహిస్తారు. ఈ తోటల నుంచి వచ్చే ఆకు కూరలు, కూరగాయల ద్వారా పిల్లలకు మరిన్ని సూక్ష్మ పోషకాలు అందించడానికి వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో ఇలాంటి తోటలు ఉన్నట్లు తెలిపింది.

* అన్ని జిల్లాల్లో ఈ పథకానికి సామాజిక ఆడిట్‌ను తప్పనిసరి చేసింది.

* రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల్లో పిల్లలకు అనుబంధ పోషకాలు అందిస్తారు.

* సంప్రదాయ వంటకాలు, స్థానికంగా అందుబాటులో ఉండే దినుసులు, కూరగాయలతో సరికొత్త వంటకాలను ప్రోత్సహించడానికి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంటల పోటీలు నిర్వహిస్తారు.

* పథకం అమలులో రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు స్థానిక సంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తారు.

* ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన విద్యార్థులు, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డైట్‌)కు చెందిన ట్రెయినీ టీచర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ పథకం అమలుతీరును పరీక్షించనున్నట్లు తెలిపింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags