Tokyo Paralympics: India finishes 24th
with record 19 medals
ముగిసిన టోక్యో పారాలింపిక్స్ - అదరగొట్టిన భారత అథ్లెట్లు
- చివరి రోజు మరో స్వర్ణం, రజతం
మొత్తం 19 పతకాలతో కొత్త చరిత్ర
‘‘టోక్యో పారాలింపిక్స్‌లో
మన పారా అథ్లెట్లు కనీసం అయిదు స్వర్ణాలతో
సహా మొత్తం 15 పతకాలు సాధిస్తారు’’.. ఇవీ క్రీడల ఆరంభానికి
ముందు ఆ బృంద సభ్యుల ధీమా! ఇలా చాలా చెప్తారు.. కానీ తీరా పోటీల్లో మాత్రం పతకాలు
రావని ఎంతోమందిలో అనుమానాలు! ఒలింపిక్స్‌లోనే సాధారణ అథ్లెట్లు అంచనాలను
అందుకోలేకపోయారు.. ఇక పారాలింక్స్‌లో పారా అథ్లెట్లు ఏం సాధిస్తారనే ప్రశ్నలు! గత
పారాలింపిక్స్‌ల్లో కలిపి మొత్తం 12 పతకాలే వచ్చాయి.. ఇక
ఇప్పుడు ఒక్క టోక్యోలోనే 15 ఎలా వస్తాయనే సందేహాలు!
కానీ చక్రాల కుర్చీలతో.. కృత్రిమ కాళ్లతో.. పనిచేయని చేతులతో.. పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన మన పారా అథ్లెట్లు ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. వైకల్యాన్ని దాటి.. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఆ ప్రశ్నలకు బదులిచ్చారు. ఆత్మవిశ్వాసం అండగా.. పోరాటమే శ్వాసగా ..అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వెలుగులు పంచారు. చివరి రోజు బ్యాడ్మింటన్‌లో స్వర్ణం, రజతం గెలిచి మొత్తం 19 పతకాలతో నవశకానికి నాంది పలికారు.
వైకల్యం తమ శరీరానికే కానీ సంకల్పానికి కాదని చాటిచెప్పిన ఈ భారత పారా అథ్లెట్లు అసలైన స్ఫూర్తి ప్రదాతలు. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు.. మొత్తం 19 పతకాలతో పట్టికలో 24వ స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రదర్శనతో సత్తాచాటారు. అయిదేళ్ల కిందట రియో క్రీడల్లో 4 పతకాలు గెలిచిన భారత బృందం.. ఇప్పుడు దానికి దాదాపు అయిదు రెట్ల మెరుగైన ప్రదర్శన చేసింది. టీటీలో భవీనాబెన్ రజతం గెలవడంతో మొదలైన పతక ప్రవాహం చివరి రోజు వరకూ కొనసాగింది.
జావెలిన్ త్రో ఎఫ్64లో సుమిత్ స్వర్ణం సాధించాడు. యోగేశ్ (డిస్కస్ త్రో), నిషాద్, తంగవేలు, ప్రవీణ్ (హైజంప్), దేవేంద్ర (జావెలిన్ త్రో) రజతాలు గెలిచారు. శరద్ (హైజంప్), సుందర్ (జావెలిన్ త్రో) చెరో కాంస్యం నెగ్గారు. షూటింగ్‌లో ఓ స్వర్ణం, కాంస్యం గెలిచిన 19 ఏళ్ల షూటర్ అవని చరిత్ర సృష్టించింది. సింగ్ రాజ్ ఓ రజతం, కాంస్యం నెగ్గాడు. మనీశ్ నర్వాల్ తుపాకీ గురి పసిడిని ముద్దాడింది. ఇక పారాలింపిక్స్‌లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను ప్రవేశపెట్టడం భారత్‌కు కలిసొచ్చింది. ప్రమోద్, కృష్ణ చెరో స్వర్ణం, సుహాస్ రజతం, మనోజ్ కాంస్యం గెలిచారు. ఆర్చరీలో హర్విందర్ కాంస్యం నెగ్గాడు. సాధారణ అథ్లెట్లతో పోలిస్తే పారా అథ్లెట్లపై చూపించే శ్రద్ధ.. వారికి లభించే ఆదరణ తక్కువే. శిక్షణ వసతులూ అంతంతమాత్రమే. కానీ జీవితంలో కష్టాలని దాటి విజేతలుగా నిలిచిన వాళ్లు.. ఆటలోనూ అడ్డంకులను దాటి ఛాంపియన్లుగా నిలవడం గొప్ప ప్రేరణను ఇచ్చేదే.
19 పతకాలు
ఈ పారాలింపిక్స్‌లో భారత్
సాధించిన పతకాలు. 5 స్వర్ణాలు, 8 రజతాలు,
6 కాంస్యాలు వచ్చాయి. 1968 నుంచి
పారాలింపిక్స్‌లో పోటీపడుతోన్న భారత్.. 2016 వరకూ మొత్తం 12 పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు ఏకంగా 19 పతకాలు
రావడం విశేషం.
0 Komentar