Halloween Day (October 31): Significance and
Origin Behind the Festival
'హాలోవీన్ డే' - అక్టోబర్ 31: ఈ పండుగ చరిత్ర మరియు ప్రాముఖ్యత వివరాలు
ఇవే
రెండు వేల సంవత్సరాలకు పూర్వమే 'హాలోవీన్
డే' ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన కాలంలో
పేగన్లు(మధ్య యుగం నాటి ఓ మతానికి చెందినవారు) 'సమ్‌హెయిన్'
అనే పండగను జరుపుకునేవాళ్లు. అదే ఈ హాలోవీన్ పండగకు ఆద్యమని
చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్‌తో పూర్తయ్యేది. అక్టోబర్ ఆఖరి
రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన
ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది.
కొత్త సంవత్సరాది సందర్భంగా
అంతకుముందు చనిపోయిన పెద్దవారి ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు
నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో
ఉండే తలుపు తెరచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి
వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు. వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా
ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా
వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. మంటలంటే ఆత్మలు భయపడతాయని
ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల
దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా ప్రారంభమైన సంప్రదాయం
పదహారో శతాబ్దంలో సరదాగా చేసే పండగగా మారిపోయింది.
ఆల్ హాలోస్ నుంచి..
క్యాథలిక్కుల సంప్రదాయం ప్రకారం నవంబర్ ఒకటిన ఆల్ సెయింట్స్ డే, రెండో తేదీన ఆల్ సోల్స్ డేగా నిర్వహించేవారు. వాటికి ముందున్న రోజు అక్టోబర్ 31న ఆల్ హాలోస్ డేగా వ్యవహరించేవారు. ఇదే రాన్రానూ హాలోవీన్స్ డే గా మారింది. పదహారో శతాబ్దం తర్వాత ఆత్మలను ఆహ్వానించడం కోసమే కాదు.. అందరూ ఒక్కచోట కూడి ఆనందంగా చేసుకునే పండగలా ఇది మారింది. ఈ పండగలో చేసే ప్రతి పనికీ ఓ చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు.
* యాపిల్ బాబింగ్ - యాపిళ్లను నీళ్లలో వేసి లేదా పైనుంచి కట్టిన దారానికి వేలాడదీసి ఉంచుతారు. వాటిని చిన్నపిల్లలు తమ నోటితో అందుకొని తినాలి. ఇలా చేస్తే వారు గెలిచినట్లు. అయితే ఆట ఆడే ముందు వారి రెండు చేతులను వెనక్కి కట్టేస్తారు. రోమన్ల కాలంలో ఈ ఆట ప్రారంభమైంది. అప్పట్లో దీన్ని పెళ్లికాని ఆడపిల్లలు ఆడేవారట. ఎవరికి ముందుగా యాపిల్ లభిస్తుందో వారే ఆ సంవత్సరం ముందు పెళ్లి చేసుకోవడానికి అర్హులన్నమాట. కానీ రాన్రానూ పద్ధతి మారి ఇది ఇప్పుడు పిల్లల ఆటగా మారింది.
* గుమ్మడికాయ కార్వింగ్ - హాలోవీన్ అంటే భయంకరంగా కార్వ్ చేసిన గుమ్మడికాయ ముఖాలే కనిపిస్తాయి. ఈ పద్ధతి కూడా పేగన్ల కాలంలోనే ప్రారంభమైంది. అయితే వాళ్లు గుమ్మడికాయలకు బదులు ముల్లంగిలా ఉండే కూరగాయలను ఇలా కార్వింగ్ చేసేవారట. ఆత్మలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు అవి భయపడేలా మనుషుల ముఖాలను పోలేలా వాటికి కార్వింగ్ చేసి అందులో ఓ దీపం పెట్టి ఇంటిముందు ఉంచేవారట. ఆల్ హాలోస్ డే రోజు పిల్లలు ఇలాంటి గుమ్మడికాయ ముఖాలను పట్టుకొని ఇళ్లన్నీ తిరుగుతారు. వారిచ్చే క్రాస్‌బన్స్, డబ్బు, ఆహారం తీసుకొని వారి కుటుంబంలో ఇంతకుముందు మరణించిన వారి ఆత్మల కోసం ప్రార్థన చేస్తారు.
ఎన్నో పద్ధతులు..
హాలోవీన్ పండక్కి ముఖ్యంగా పై
నుంచి దిగివచ్చే ఆత్మల కోసం ఆహారాన్ని సిద్ధం చేయడం, గుమ్మడికాయ
కార్వింగ్ చేయడం, వాటిని తమ దగ్గరకు రాకుండా ఉండేలా రకరకాల
భయం గొలిపే దుస్తులు ధరించడం ప్రపంచమంతా కామన్‌గా మారిపోయింది. వీటికి తోడు భయం
గొలిపే దుస్తులు ధరించి.. తమ తోటివారిని రకరకాలుగా ఆటపట్టించడం, అంతా కలిసి వివిధ ఆటలు ఆడుకోవడం ఈ పండగలో ముఖ్యంగా మారింది. అయితే ఈ పండగ
జరుపుకోవడంలోనూ వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులున్నాయి.
* చెక్ రిపబ్లిక్‌లో కుటుంబ
సభ్యుల కోసమే కాదు, మరణించిన వారికోసం కూడా డైనింగ్ టేబుల్
చుట్టూ కుర్చీలను అమరుస్తారు. వారు తమతో పాటు కూర్చొని భోజనం చేస్తారని వారు
నమ్ముతారు.
* ఆస్ట్రేలియాలో
పడుకునేముందు బ్రెడ్, నీళ్లు, ఓ దీపం
టేబుల్ మీద పెట్టి ఆత్మల కోసం వదిలేసి వెళ్తారు. పైలోకం నుంచి వచ్చినవారు ఆకలితో
తిరిగి వెళ్లకూడదని వారు ఇలా చేస్తారట.
* జర్మనీ ప్రజలు ఆరోజు
ఇళ్లలోని కత్తులను దాచేస్తారు. వాటివల్ల ఆత్మలకు ఏదైనా నష్టం జరుగుతుందని వారు
భావించడమే దీనికి కారణం.
* ఐర్లాండ్‌లో హాలోవీన్
సందర్భంగా బార్న్‌బ్రాక్ కేక్(కేక్ మిశ్రమంలో టీ కలిపి చేసే ప్రత్యేకమైన కేక్)ని
తినడం పరిపాటి. దీన్ని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే సూచనగా కూడా వాడతారు.
బార్న్‌బ్రాక్ కప్‌కేక్‌లో వివిధ పదార్థాలు ఉంచి మరికాస్త మిశ్రమం వేసి బేక్ చేస్తారు.
అందులో ఎవరికి ఏ పదార్థం వచ్చిందన్నదాని ఆధారంగా భవిష్యత్తును వూహిస్తారు. ఉంగరం
వస్తే ఆ ఏడాది వారికి పెళ్లవుతుందని, స్ట్రా ముక్క వస్తే ఆ
ఏడాదంతా వారికి శుభం జరుగుతుందని, నాణెం వస్తే ఏడాదంతా
ఆర్థికంగా బాగుంటుందని, బఠానీ గింజ వస్తే ఆ ఏడాది వారికి
పెళ్లి కాదని, కర్రపుల్ల వస్తే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు
ఎదురవుతాయని వారు నమ్ముతారు.
0 Komentar