Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Neeraj, Mithali and Chhetri among 11 recommended for Khel Ratna; 35 named for Arjuna Award

 

Neeraj, Mithali and Chhetri among 11 recommended for Khel Ratna; 35 named for Arjuna Award

ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ వీరులకు ఖేల్‌రత్న - మిథాలీ రాజ్‌, సునీల్‌ ఛెత్రికి కూడా ఖేల్‌రత్న - 35 మందికి అర్జున అవార్డులు 

అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో అదరగొట్టిన అథ్లెట్లకు.. పారాలింపిక్స్‌లో పతకాల పంట పండించిన పారా అథ్లెట్లకు.. క్రీడా పురస్కారాల్లో అగ్రపీఠం దక్కింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు వాళ్లను వరించనుంది. మరోవైపు దేశ మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ కూడా ఈ జాబితాలో ఉంది. దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు ఆమె చేసిన సేవకు ఇప్పుడు ఈ గుర్తింపు దక్కనుంది. ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి సైతం ఈ గౌరవం అందుకోనున్నాడు.'

మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి భారీ సంఖ్యలో జాతీయ క్రీడా   పురస్కారాలను ప్లేయర్లు అందుకోనున్నారు. దేశ అత్యున్నత క్రీడా అవార్డు అయిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న కోసం ఏకంగా 11 మందిని సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించింది. గతేడాది అయిదుగురికి ఈ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు అర్జున పురస్కారం కోసం 35 మంది ఆటగాళ్లను కమిటీ ఎంపిక చేసింది. 2020 కంటే ఈ సారి అధికంగా   ఎనిమిది మంది ఈ అవార్డు దక్కించుకోనున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పురస్కారాలు అందజేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం కోసం ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను వాయిదా వేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు అందుకున్న అథ్లెట్లనూ పురస్కారాల జాబితాలో చేర్చడంతో ఈ సారి అత్యధిక మందికి అవార్డులు సొంతం చేసుకునే అవకాశం దక్కింది. బుధవారం ఈ అవార్డుల సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించిన జాబితాను ఇక కేంద్ర క్రీడల శాఖ ఆమోదించడమే  తరువాయి. ఏమైనా అసాధారణ పరిస్థితులు ఎదురైతే తప్పా కమిటీ ప్రతిపాదించిన అథ్లెట్లందరికీ అవార్డులు రావడం ఖాయం. టీమ్‌ఇండియా సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన టీటీ ప్లేయర్‌ భవీనా పటేల్‌, షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌, హైజంప్‌ అథ్లెట్‌ నిషద్‌ కుమార్‌, పురుషుల హాకీ జట్టులోని ఆటగాళ్లు (గతంలో ఈ అవార్డు పొందని వాళ్లు), మహిళల జట్టులోని వందన, మోనిక, ఫెన్సర్‌ భవానీ దేవి, బాక్సర్‌ సిమ్రన్‌జీత్‌, రెజ్లర్‌ దీపక్‌ పునియా, షూటర్‌ అభిషేక్‌ వర్మ, కబడ్డీ ఆటగాడు సందీప్‌ నర్వాల్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా తదితరులు అర్జున అవార్డులు అందుకోనున్నారు. అర్జున అవార్డు స్వీకరించే 57వ క్రికెటర్‌గా ధావన్‌ నిలుస్తాడు. ద్రోణాచార్య అవార్డుల కోసం  అథ్లెటిక్స్‌ కోచ్‌లు రాధాకృష్ణ, టీపీ ఓసెఫ్‌, హాకీ కోచ్‌ సందీప్‌ సంగ్వాన్‌లతో పాటు మరికొంత మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సారి ఖేల్‌రత్న, అర్జున పురస్కార విజేతలకు వరుసగా రూ.25 లక్షలు, రూ.15 లక్షల చొప్పున  అందనున్నాయి. గతేడాది ఇది వరుసగా రూ.7.5 లక్షలు, రూ.5 లక్షలుగా ఉంది. 

ఖేల్‌రత్నాలు - 11

1. నీరజ్‌ చోప్రా: టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో ఛాంపియన్‌గా నిలిచి అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా (2008లో స్వర్ణం) తర్వాత వ్యక్తిగత పసిడి నెగ్గిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు.

2. రవి దహియా: రవి.. టోక్యోలో 57 కేజీల విభాగంలో రజతంతో అదరగొట్టాడు. హరియాణాకు చెందిన ఈ 23 ఏళ్ల రెజ్లర్‌ చిన్నప్పటి నుంచే కుస్తీపై పట్టు సాధించి అంచలంచెలుగా ఎదిగి ఒలింపిక్స్‌ పతకం సాధించాడు.

3. పీఆర్‌ శ్రీజేష్‌: 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం (కాంస్యం) సాధించడంలో శ్రీజేష్‌ కీలక పాత్ర పోషించాడు. కేరళకు చెందిన 33 ఏళ్ల ఈ గోల్‌ కీపర్‌ 17 ఏళ్ల కెరీర్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

4. లవ్లీనా బోర్గోహెయిన్‌: టోక్యోలో కాంస్యంతో సత్తాచాటింది లవ్లీనా. 24 ఏళ్ల ఈ అస్సామీ.. ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో పతకం గెలిచిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది.

5. సునీల్‌ ఛెత్రి: దేశంలో ఖేల్‌రత్న అవార్డును అందుకోనున్న తొలి ఫుట్‌బాలర్‌ ఛెత్రినే. అతను 125 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 80 గోల్స్‌ చేశాడు. ప్రస్తుత ఫుట్‌బాలర్లలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో మెస్సితో కలిసి ఛెత్రి రెండో స్థానంలో ఉన్నాడు.

6. మిథాలీ రాజ్‌: భారత మహిళల క్రికెట్‌ అంటే ముందుగా ఆమె పేరే గుర్తుకు వస్తుంది. తన జీవితాన్ని ఆటకే అంకితం చేసిన ఆమెనే.. మన హైదరాబాదీ మిథాలీ రాజ్‌. ఇప్పుడీ దిగ్గజానికి దేశ క్రీడా అత్యున్నత అవార్డు ఖేల్‌రత్న వరించనుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత అమ్మాయిల క్రికెట్‌ జట్టు ముఖచిత్రంగా మిథాలీ కొనసాగుతోంది. సరైన సౌకర్యాలు లేని రోజుల్లోనూ ఆట కోసం ప్రాణం పెట్టి.. అద్భుత ప్రదర్శనతో అమ్మాయిలను క్రికెట్‌ వైపు మళ్లేలా చేసింది. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె.. 22 ఏళ్ల కెరీర్‌ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ టెస్టు, వన్డే కెప్టెన్‌గా జట్టును నడిపిస్తోంది. మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ మిథాలీనే. టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌ (పురుషులతో కలిపి)గానూ ఆమె నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌ తర్వాత సుదీర్ఘ కెరీర్‌ మిథాలీదే. ఇంకా ఎన్నో రికార్డులు ఆమె సొంతం. 12 టెస్టుల్లో 699 పరుగులు చేసిన ఆమె.. 220 వన్డేల్లో 7391 పరుగులు చేసింది. 89 టీ20ల్లో 2364 పరుగులు చేసింది. మొత్తం మీద 8 శతకాలు సాధించింది

7. ప్రమోద్‌ భగత్‌: అయిదేళ్ల వయసులోనే పోలియో బారిన పడ్డా, పట్టుదలతో రాకెట్‌ పట్టి ముందుకు సాగిన ప్రమోద్‌.. టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో పసిడి అందుకున్నాడు. ఈ విభాగంలో అతనే ప్రపంచ నంబర్‌వన్‌.

8. సుమిత్‌ అంటిల్‌:  17 ఏళ్ల వయసులోనే ఓ ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయినా.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన సుమిత్‌.. పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌64లో ఛాంపియన్‌గా నిలిచాడు. 23 ఏళ్ల ఈ హరియాణా అథ్లెట్‌ ఖాతాలోనే ప్రపంచ రికార్డూ ఉంది.

9. అవని లెఖరా: ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత పారా అథ్లెట్‌గా అవని చరిత్ర చరిత్ర సృష్టించింది. టోక్యోలో 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌లో పసిడి నెగ్గిన ఈ 19 ఏళ్ల రాజస్థాన్‌ షూటర్‌.. 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.

10. కృష్ణ నగార్‌: మరుగుజ్జు అయిన కృష్ణ.. పారా బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరాడు. రాజస్థాన్‌కు చెందిన ఈ 22 ఏళ్ల షట్లర్‌ టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎస్‌6 విభాగంలో స్వర్ణంతో సత్తాచాటాడు.

11. మనీశ్‌ నర్వాల్‌: వైకల్యం కారణంగా తన కుడి చేతిని లేపలేని మనీశ్‌.. ఎడమ చేతితోనే అద్భుతాలు చేస్తున్నాడు. 19 ఏళ్ల ఈ హరియాణా షూటర్‌.. ప్రపంచ రికార్డుతో పారాలింపిక్స్‌ పసిడి పట్టేశాడు. మిక్స్‌డ్‌ పీ4 50మీ. పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలోనూ ఛాంపియన్‌గా నిలిచాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags