TS: ‘పది’లో ఈసారి ఆరు
పరీక్షలే: విద్యాశాఖ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర పదో తరగతిలో ఈ
ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘పది’
పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం
ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఈసారి
ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష
చొప్పున ఉండాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా
ప్రభావంతో పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో
తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం
నిర్ణయించింది. గతేడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో
పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష రాయకుండానే అందరినీ
ఉత్తీర్ణులను చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది ప్రతిపాదించిన విధానాన్నే
అమలు చేయాలని నిర్ణయించారు.
కొత్త విధానం ప్రకారం పదో తరగతి
విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు. గతేడాది ముందువరకు 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 166 రోజులు
బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో
విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితులన్నింటినీ
దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేయాలని
నిర్ణయించారు.
0 Komentar