7 Money Management Tips to Improve Your
Finances
ఆర్థిక నిపుణులు పాటించిన ఈ 7 మనీ మేనేజ్‌మెంట్
సూత్రాలు గురించి తెలుసుకోండి
డబ్బు విషయంలో నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ మదుపు చేయాలి? వంటి విషయాల్లో కొన్ని నియమాలు పాటిస్తేనే ఆర్థికంగా అనుకున్న విజయం సాధిస్తాం. అందుకోసం ఆర్థిక నిపుణులు ఏడు డబ్బు సూత్రాలు సూచించారు. అవేంటో చూద్దాం!
1. మీరు ఎలాంటి మదుపరి?
పెట్టుబడి పెట్టేవాళ్లలో చాలా రకాల
మనుషులుంటారు. కొంత మంది వ్యక్తిగత అవసరాల కోసం మదుపు చేస్తే మరికొందరు కుటుంబం
కోసం పెట్టుబడి పెడతారు. మరికొందరు పిల్లల చదువు కోసం.. పెళ్లిళ్ల కోసం మదుపు
చేస్తారు. కొంత మంది దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెడితే.. మరికొందరు స్వల్పకాలిక
లక్ష్యాల కోసం మదుపు చేస్తారు. కొంత మంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి
ఇష్టపడతారు. కొంత మందికి చిన్నపాటి నష్టాన్ని భరించే స్తోమత కూడా ఉండదు. వ్యక్తి, వారి
లక్ష్యాలు, అవసరాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత ఐదేళ్లలో 414 శాతం రాబడినిచ్చాయి. ఒకవేళ మీరు 10-15 ఏళ్లు మదుపు చేయాలని భావిస్తే.. ఈ స్టాక్ ఒక్క శాతం పడినా పెద్దగా చింతించరు. అదే మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే.. స్టాక్ 0.1 శాతం పడినా పెద్ద ప్రభావమే ఉంటుంది. అందుకే మీరు ఎలాంటి మదుపరి అనే విషయాన్ని తొలుత గుర్తించాలి. దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి.
2. కాలమే కీలకం
వారెన్ బఫెట్ గొప్ప మదుపరి అని
మనందరికీ తెలుసు. కానీ, నిజానికి రేట్ ఆఫ్ రిటర్న్స్(25%) పరంగా
చూసుకుంటే ఆయనకంటే గొప్పవాళ్లు ఇంకా ఉన్నారు. అయితే, వారెవరికీ
బఫెట్‌కు ఉన్నంత సంపద లేదు. హెడ్జ్ ఫండ్ రెనైసాన్స్ టెక్నాలజీస్ అధిపతి జిమ్
సైమన్స్ తన సంపదపై 66 శాతం రిటర్న్స్ సాధించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ
స్థాయిలో రిటర్న్స్ సాధించిన వ్యక్తి మరొకరు లేరు. కానీ, సైమన్స్
సంపద బఫెట్ ఆస్తిలో 25 శాతం మాత్రమే. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం సమయం. బఫెట్
చాలా తక్కువ వయసులో మదుపు చేయడం ప్రారంభించారు. సంపద సృష్టికి ఎక్కువ రేట్ ఆఫ్
రిటర్న్స్ రావాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాలం మదుపు చేసినా పెద్ద మొత్తంలో డబ్బు
సంపాదించొచ్చు.
ప్రపంచంలో చక్రవడ్డీ ఎనిమిదో వింత. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారు సంపాదిస్తారు. చేసుకోలేనివారు చెల్లిస్తారు - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
3. నియంత్రణే నిలబెడుతుంది
దీర్ఘకాలం మదుపు చేయాలి. పెట్టుబడిని డైవర్సిఫై చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పుడే చక్రవడ్డీ మ్యాజిక్ చేస్తుంది. ఇంత వరకైతే సులువుగానే ఉంటుంది. అయితే, భయం, అత్యాశ వంటి భావోద్వేగాలు తోడైతే ఈ సులభమైన ప్రక్రియే క్లిష్టంగా మారుతుంది. ఉదాహరణకు ఏదైనా పెట్టుబడి పథకం మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదని భావిస్తే.. వెంటనే భయపడి దాన్ని ఇంకో మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేస్తాం. అదే తరహాలో ఊహించని లాభాలొస్తే.. మరింత సొమ్మును కుమ్మరించేస్తాం. కానీ, దీర్ఘకాలంలో ఈ రెండూ మంచి చేయవు. వీటిని నియంత్రించుకోగలిగితే.. ఓ క్రమశిక్షణ గల మదుపరిగా నిలబడగలుగుతాం. లేదంటే మీ ఆర్థిక లక్ష్యాలకు ఇవే అవరోధంగా మారతాయి.
4. రిస్క్ ఉంటేనే
రిటర్న్స్
రిస్క్ లేని చోట రిటర్న్స్ ఉండవు. ఎక్కువ రాబడి కావాలంటే.. ఎక్కవ నష్టభయం ఉన్న పథకాల్ని ఎంచుకోవాల్సిందే! అయితే, అందుకు మీ పరిస్థితులు సహకరించాలి. మనం చేసే పెట్టుబడిపై వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంతో పాటు ఆపై మంచి లాభాలు కూడా ఇవ్వాలి. అప్పుడే మన మదుపునకు అర్థం ఉంటుంది. అయితే, ఎంత రిస్క్ తీసుకోవాలన్నది పూర్తిగా మీ పరిస్థితులు, అవసరాలు, లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాలి.
5. ఆదాయం కంటే తక్కువ వ్యయం
ఈ ఏడాది మీ ఆదాయం 3, వ్యయం 6. ఇది ఉగాది రోజు రాశిఫలాల్లో వినిపించే మాట. కానీ, మీ ఆర్థిక ప్రణాళికలో ఇలాంటి పరిస్థితికి అసలు తావుండొద్దు. మీ ఖర్చులు మీ సంపాదనను ఎప్పుడూ మించొద్దు. ఇంతకంటే పెద్ద ఆర్థిక సూత్రం మరొకటి లేదు. మీ ఆర్థిక ప్రణాళికకు మూలమంత్రం కూడా ఇదే కావాలి. అలా అని మరీ పిసినారి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. మీరు సంపాదించిన దాంతోనే ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చు. అర్థవంతమైన మదుపూ చేయొచ్చు.
6. అప్పుతో మదుపు చేయొద్దు
అప్పు అంటే.. మన దగ్గర లేనప్పుడు తీసుకునే ఆర్థిక సాయం. మరి మన దగ్గర డబ్బే లేనప్పుడు మరి మదుపు మాటే ఉత్పన్నం కావొద్దు. అప్పు చేసి మదుపు చేస్తే.. అది తీవ్ర ఇబ్బందులకు దారితీయొచ్చు. సాధారణంగా డబ్బు సమకూర్చుకునేందుకు మనకు వ్యక్తిగతంగా ఎలాంటి మార్గం లేనప్పుడే అప్పు చేస్తుంటాం. మరి అప్పు చేసి మదుపు చేశామనుకోండి.. అది సరైన ఫలితాలు ఇవ్వకపోతే! అప్పెలా తీర్చగలం?ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి నష్టభయం ఎక్కువ ఉండే వాటిల్లో అప్పు చేసిన సొమ్ముతో అసలే మదుపు చేయొద్దు.
7. మీపై మీరు మదుపు చేయండి
సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్లందరూ
తమని తాము మరింత సమర్థంగా మార్చుకోవడం కోసం మదుపు చేస్తుంటారు. మదుపుపై అవగాహన
కోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. వీలైనన్ని కోర్సులు చేస్తారు!
అప్పుడే ‘ఖరీదైన తప్పుల్ని’ చేయడం మానేస్తారు. ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా
పెట్టుబడి పెడతారు. అప్పుడే మన మదుపు సంపదను సృష్టించి పెడుతుంది.
జ్ఞానం కోసం చేసే మదుపు అత్యున్నతమైన రాబడినిస్తుంది - బెంజమిన్ ఫ్రాంక్లిన్
ఈ ఏడు సూత్రాలు మీ జీవితంలో
భాగమవ్వాలి. అప్పుడే మీ వ్యయం, పొదుపు, మదుపు
సరైన దశలో ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలు క్రమంగా నెరవేరతాయి.
0 Komentar