Elon Musk's tweet on Parag Agrawal,
Other Indian Tech CEOs
భారతీయుల ప్రతిభను ప్రశంసిస్తూ ఎలాన్
మస్క్ స్పందన ఇదే
ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మనదేశ ప్రభ వెలిగిపోతోంది. ఐటీలో మేటిగా ఎదిగిన భారత్.. మేలిమి నిపుణులకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి ప్రపంచస్థాయి టాప్ కంపెనీల సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్ అగర్వాల్ చేరారు. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన ఆ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నారు.
భారతీయుల ప్రతిభను ప్రశంసిస్తూ ఆర్థిక సేవల సంస్థలకు సాఫ్ట్‌వేర్ అందించే ప్రముఖ కంపెనీ స్ట్రైప్ సీఈఓ పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. భారత్ నుంచి వచ్చిన వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
పాట్రిక్ కొలిసన్ ట్వీట్‌కు బిలియనీర్ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. ‘భారతీయుల ప్రతిభ నుంచి అమెరికా భారీగా లబ్ధి పొందుతోంది’ అని వ్యాఖ్యానించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సహా ఇతర కంపెనీలతో వినూత్న ఆవిష్కరణలకు మస్క్ శ్రీకారం చుడుతున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఆవిష్కర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యువతలో విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి భారతీయుల ప్రతిభకు గుర్తించి.. దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం విశేషం. భారతీయుల టాలెంట్‌పై గతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
అమెరికాకు భారీ ఎత్తున వలసవెళ్తున్న దేశాల జాబితాలో చైనా తర్వాత భారత్ ఉంది. ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లే విద్యార్థులు తమ ప్రతిభతో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అక్కడే కొనసాగుతూ.. శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) పొందుతున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లో తమదైన ప్రతిభ కనబరుస్తున్న భారతీయులు అనేక కంపెనీల నిర్వహణ బాధ్యతల్ని మోస్తున్నారు. వాటి అధిపతులుగా ఎదుగుతున్నారు. ప్రపంచంలో నవకల్పనలకు అడ్డాగా మారిన సిలికాన్ వ్యాలీలోనూ భారతీయులు తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత పిన్న సీఈఓ..
ప్రపంచంలో టాప్ 500 కంపెనీ సీఈఓల్లో పరాగ్ అగర్వాలే అత్యంత పిన్న వయస్కుడని సమాచారం. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, పరాగ్.. ఇద్దరిదీ ఒకే వయసని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అయితే, భద్రత కారణాలరీత్యా వీరి పుట్టిన తేదీలను బహిర్గతం చేయబోరు. కానీ, జుకర్‌బర్గ్ కంటే కూడా పరాగ్ చిన్నవాడని బ్లూమ్‌బర్గ్ తమకున్న సమాచారం మేరకు విశ్లేషించింది. టాప్ 500 కంపెనీల సీఈఓల సగటు వయసు 58. ప్రముఖ మదుపరి, బెర్క్‌షైర్ హాత్‌వే అధిపతి వారెన్ బఫెట్(90) అత్యంత పెద్ద వయసు సీఈఓగా కొనసాగుతున్నారు.
USA benefits greatly from Indian talent!
— Elon Musk (@elonmusk) November 29, 2021
0 Komentar